PM Modi : యువత రాజకీయాల్లోకి రావాలి
ABN , Publish Date - Oct 21 , 2024 | 03:20 AM
దేశంలో కుటుంబ వారసత్వ రాజకీయాలు ఉండడం మంచిది కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందువల్ల రాజకీయ నేపథ్యంలేని కుటుంబాలకు చెందిన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
ఇదో ఉద్యమంలా సాగాలి.. అప్పుడే అవినీతి అంతం.. పరివార్‌వాదంతో దేశానికి ముప్పు: మోదీ
వారాణసిలో శంకర నేత్రాలయం ప్రారంభం
ఎన్‌డీఏ అంటే.. ‘నరేంద్ర దామోదర్‌దాస్ కా అనుశాసన్’: శంకరాచార్య
వారాణసి, అక్టోబరు 20: దేశంలో కుటుంబ వారసత్వ రాజకీయాలు ఉండడం మంచిది కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందువల్ల రాజకీయ నేపథ్యంలేని కుటుంబాలకు చెందిన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ‘రాజకీయ వంశాలు’ దేశ యువతకు నష్టం కలిగించాయని విమర్శించారు. ఆదివారం వారాణసిలో కంచిపీఠం నెలకొల్పిన ఆర్‌జే శంకర నేత్ర వైద్యశాలను ప్రారంభించడంతో పాటు, రూ.6,700 కోట్లతో చేపట్టిన వివిధ పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘‘పరివార్‌వాదులతో దేశానికి పెద్ద ముప్పు ఉంది. యువతకు అవకాశాలు ఇవ్వడంలో వారికి నమ్మకం లేదు. అందువల్లనే రాజకీయ నేపథ్యంలేని కుటుంబాలకు చెందిన లక్ష మంది యువత రాజకీయాల్లో పాల్గొనాలని ఎర్రకోట నుంచి పిలుపునిచ్చాను.
దేశ రాజకీయాలను మార్చేందుకు, అవినీతిని, పరివార్‌వాద సిద్ధాంతాన్ని నిర్మూలించేందుకు దీన్ని ఉద్యమంలా చేపట్టాలి’’ అని అన్నారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఆశ్రిత పక్షపాతాన్ని పోషిస్తున్నాయని విమర్శించారు. గతంలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు పత్రికల్లో పతాక శీర్షికలుగా ఉండేవని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. కాగా, ఈ సమావేశంలో కంచి కామకోటి పీఠం శంకరాచార్య జగద్గురు విజయేంద్ర సరస్వతి స్వామి ప్రసంగిస్తూ ప్రధాని మోదీ, ఎన్‌డీఏలను దేవుడు అనుగ్రహించాడని అన్నారు.
ఎన్‌డీఏ అంటే ‘నరేంద్ర దామోదర్‌దాస్ కా అనుశాసన్’ (నరేంద్ర దామోదర్‌దాస్ పరిపాలన) అని అభివర్ణించారు. తొలుత సంస్కృతంలో ప్రసంగాన్ని ప్రారంభించిన శంకరాచార్య మోదీ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. అందరి సంక్షేమానికి కృషి చేస్తూ ప్రపంచంలోనే ఆదర్శ ప్రభుత్వంగా ఉంటోందని చెప్పారు. ఇటీవలి కశ్మీర్ ఎన్నికల ఫలితాలను కూడా ప్రశంసించారు. తనకు ప్రధాని మోదీతో చిరకాలంగా అనుబంధం ఉందని చెప్పారు. కోయంబత్తూరులో తొలుత నేత్ర వైద్యశాలను ప్రారంభించామని, ఇది 17వదని చెప్పారు. ప్రధాని మోదీ తన నియోజకవర్గమైన వారాణసిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్, విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ పనులకు శంకుస్థాపన చేశారు. ఆగ్రా, బగ్‌డోగ్రా, రేవా, అంబికాపూర్, సార్‌సావా విమానాశ్రయాల పనులకు కూడా శంకుస్థాపనలు చేశారు.