Share News

PM Modi: శాంతి సందేశంతో యుద్ధభూమికి!

ABN , Publish Date - Aug 22 , 2024 | 04:47 AM

ప్రధాని నరేంద్ర మోదీ 2014లో పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 78 విదేశీ పర్యటనలు చేశారు! ఒక దేశ ప్రధాని ఇలా విదేశీ పర్యటనలు చేయడం సాధారణమైన విషయమే కాబట్టి ఎవరూ ఆ పర్యటనల గురించి అంతగా పట్టించుకోలేదు!

PM Modi: శాంతి సందేశంతో యుద్ధభూమికి!

  • ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటనపై ప్రపంచదేశాల చూపు

  • పుతిన్‌ను కలిసిన నెలన్నరలోపే జెలెన్‌స్కీతో భేటీపై సర్వత్రా ఆసక్తి

ప్రధాని నరేంద్ర మోదీ 2014లో పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 78 విదేశీ పర్యటనలు చేశారు! ఒక దేశ ప్రధాని ఇలా విదేశీ పర్యటనలు చేయడం సాధారణమైన విషయమే కాబట్టి ఎవరూ ఆ పర్యటనల గురించి అంతగా పట్టించుకోలేదు! కానీ.. ఇప్పుడు ప్రపంచం చూపంతా మోదీపైన, ఆయన ఉక్రెయిన్‌ పర్యటనపైనే ఉందంటే అతిశయోక్తి కాదు! అమెరికా, యూకే, చైనాలాంటి దేశాల్లాగా.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో భారత్‌ ఎటూ మొగ్గు చూపకుండా వ్యవహరించడమే ఈ ఆసక్తికి కారణం!! ఆ కారణంతోనే అమెరికా, యూకే, యూరప్‌ దేశాలు.. యుద్ధాన్ని ఆపేలా పుతిన్‌ను ఒప్పించాలని ప్రధాని మోదీని ఇన్నాళ్లుగా కోరుతున్నాయి.


రెండు దేశాలనూ శాంతిచర్చలకు తేవాలని అప్పీలు చేస్తున్నాయి. ‘‘ఇది యుద్ధాల శకం కాదు’’ అని గతంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను.. ఎలాంటి సమస్యనైనా చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలన్న ఇండియా వైఖరిని.. అమెరికా విదేశాంగ శాఖ అధికారి ఒకరు ఇటీవలే గుర్తుచేశారు. పుతిన్‌తో తనకున్న ప్రత్యేక భాగస్వామ్యాన్ని ఉపయోగించి యుద్ధ విరమణకు ఒత్తిడి తేవాలని మోదీని ఆమె కోరారు. అయినా భారత్‌ ఆయా దేశాల విజ్ఞప్తులను పెద్దగా పట్టించుకోలేదు. పైగా.. వ్యూహాత్మకంగా రష్యా నుంచి చౌకగా చమురు దిగుమతి చేసుకుంటోంది.


ఆ దేశం నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తూనే ఉంది. అదే సమయంలో మానవతా సాయం కింద.. అత్యవసర ఔషధాలు, జనరేటర్లు వంటివాటిని ఉక్రెయిన్‌కు ఈ రెండేన్నరేళ్లుగా పంపిస్తూ తటస్థంగా వ్యవహరిస్తోంది. అయితే, ఉక్రెయిన్‌కు సాయం సంగతి ఎలా ఉన్నా.. రష్యా నుంచి చమురు, ఆయుధాల కొనుగోలుపై యూరప్‌ దేశాలు మొదట్నుంచీ కినుకగానే ఉన్నాయి. అంతర్జాతీయ ఆంక్షలను సైతం పట్టించుకోకుండా వాటిని కొనుగోలు చేయడం ద్వారా పుతిన్‌ యుద్ధకాంక్షకు భారత్‌ ఆజ్యం పోస్తోందని విమర్శిస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో.. మోదీ ఉక్రెయిన్‌ పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.


అంతేకాదు.. యుద్ధం మొదలయ్యాక రెండు దేశాల్లోనూ (రష్యా, ఉక్రెయిన్‌) పర్యటించిన పెద్ద దేశాధినేత ఇప్పటిదాకా ఎవరూ లేరు. ఆ ఘనత కూడా మోదీకి దక్కనుంది. ఇంతటి కీలకమైన పర్యటనలో మోదీ.. ఇరు దేశాలనూ శాంతి చర్చల టేబుల్‌ వద్దకు తీసుకురాగలరా? లేక.. ఉక్రెయిన్‌కు సాయంతోనే సరిపెడతారా? లేక రష్యాతో మాట్లాడి యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తానని జెలెన్‌స్కీకి చెబుతారా? అంటే.. వేచి చూడాల్సి ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఉక్రెయిన్‌ మాత్రం.. మోదీ పర్యటనపై అత్యంత ఆశావహంగా ఉంది. యుద్ధంతో దెబ్బతిన్న తమ ఆర్థికవ్యవస్థను పునర్నిర్మించుకోవడంలో భారత్‌ సాయాన్ని ఆశిస్తోంది. ఈ క్రమంలోనే.. నెలరోజుల కిత్రం జెలెన్‌ స్కీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ అంద్రేయ్‌ యెర్మాక్‌ మన జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోభాల్‌కు ఫోన్‌ చేసి ఉక్రెయిన్‌ శాంతి సాధనలో మోదీ కీలకపాత్ర పోషిస్తారన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు.


  • కీలక దశ..

ఉక్రెయిన్‌ నుంచి రష్యా సైన్యాన్ని పుతిన్‌ ఉపసంహరించుకుంటేనే.. ఆయనతో చర్చలు సాధ్యమని జెలెన్‌స్కీ ఇన్నాళ్లూ పట్టుపట్టి కూర్చున్నారు. కానీ, రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్‌కు జర్మనీ, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాలు చేస్తున్న సాయం క్రమంగా తగ్గుతోంది. మరోవైపు అమెరికా ‘అధ్యక్ష’ ఎన్నికల హడావుడిలో ఉంది. దీంతో ఇటీవలే జెలెన్‌స్కీ ఒకింత తగ్గి.. ఎలాంటి షరతులూ పెట్టకుండా తాను చర్చలకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో.. ఇన్నాళ్లుగా తమ భూభాగంలో మాత్రమే జరుగుతున్న యుద్ధాన్ని రష్యా భూభాగంలోకి తీసుకెళ్లారు. అక్కడికి తన సేనలను పంపి కర్స్క్‌ ప్రాంతంలో 90 శాతం భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. శాంతికి సిద్ధమంటూనే, ‘దాడులకు భయపడం.. ప్రతిదాడులకు సిద్ధం’ అనే విషయాన్ని పుతిన్‌కు అర్థమయ్యేలా చెప్పడం జెలెన్‌స్కీ లక్ష్యం. అంతేకాదు.. శాంతి చర్చలంటూ జరిగితే ‘మీరు ఆక్రమించుకున్న మా భూభాగాలను మాకిస్తే.. మీ భూభాగాలను మీకిస్తాం’అని బేరం పెట్టొచ్చని ఆయన భావిస్తున్నారు. ఇలాంటి కీలకమైన సమయంలో మోదీ ఉక్రెయిన్‌ పర్యటనకు వెళ్లడం గమనార్హం.


  • పోలండ్‌ చేరుకున్న ప్రధాని

కీవ్‌, ఆగస్టు 21: ఉక్రెయిన్‌ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కనుగొనే అంశంపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీతో విస్తృత చర్చలు జరపనున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఉక్రెయిన్‌ భారత్‌కు మిత్ర దేశమని బుధవారం ఆయన పోలండ్‌, ఉక్రెయిన్‌ పర్యటనకు బయల్దేరేముందు ఓ ప్రకటనలో తెలిపారు. ఉక్రెయిన్‌లో వీలైనంత త్వరగా శాంతి స్థాపన జరగాలని కోరుకుంటున్నామన్నారు. పోలండ్‌, ఉక్రెయిన్‌ దేశాలతో భారత్‌ బంధాలు మరింత బలోపేతమవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.


రెండో రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ప్రధాని పోలండ్‌ చేరుకున్నారు. భారత్‌, పోలండ్‌ల మధ్య దౌత్యసంబంధాలకు 70 ఏళ్లు పూర్తైన సందర్భంగా మోదీ పోలండ్‌ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పోలండ్‌ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. కాగా, వార్సాలో ఆయనకు ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ పోలండ్‌ అధ్యక్షుడు ఆండ్రెజ్‌ సెబాస్టియన్‌ డ్యూడా, ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. తర్వాత ఆయన ఈ నెల 23న ‘రైల్‌ ఫోర్స్‌ వన్‌’ రైలులో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు చేరుకుంటారు.

Updated Date - Aug 22 , 2024 | 06:51 AM