PM Modi: పిల్లాడి తీరులో మార్పు రాలేదు.. రాహుల్ గాంధీపై మోదీ వ్యంగ్యాస్త్రాలు
ABN , Publish Date - Jul 02 , 2024 | 06:32 PM
ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పిల్లాడి తీర్పులో ఇంకా మార్పు రాలేదని, తనని కొడుతున్నారంటూ దొంగ ఏడ్పులు ఏడ్చాడని ఎద్దేవా...
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తాజాగా కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పిల్లాడి తీర్పులో ఇంకా మార్పు రాలేదని, తనని కొడుతున్నారంటూ దొంగ ఏడ్పులు ఏడ్చాడని ఎద్దేవా చేశారు. ఆ పిల్లాడు సభలో కన్ను కొట్టిన తీరుని అంతా చూశారని పేర్కొన్నారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగిస్తూ.. మోదీ ఈ సెటైర్లు గుప్పించారు. సోమవారం సభలో రాహుల్ గాంధీ ప్రసంగం గురించి ప్రస్తావిస్తూ.. ‘‘సభలో కొందరు దొంగ ఏడుపులు ఏడ్చారు. తనని కొడుతున్నారని మాట్లాడారు. పిల్లాడి తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. సభలో ఆ పిల్లాడు కన్ను కొట్టిన తీరు అంతా చూశారు’’ అని మోదీ చెప్పుకొచ్చారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతూ.. 60 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన అరాచకంగా సాగిందని మోదీ ఆరోపించారు. దేశం నలుమూలల ఆ పార్టీ విషయం చిమ్మిందని వ్యాఖ్యానించారు. భాషలు, ప్రాంతాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టిందని విమర్శించారు. ఓబీసీ వర్గాలను కాంగ్రెస్ దొంగలుగా చిత్రీకరిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గ్రహించారని.. అబద్ధాలతో చేసే రాజకీయాలు ఎంతోకాలం నడవవని హితవు పలికారు. మొన్నటి ఎన్నికల్లో ఈవీఎంలపై కూడా బురదజల్లారని మండిపడ్డారు. రాజ్యాంగం, రిజర్వేషన్లు, రఫెల్‌పైనే దుష్ప్రచారం చేశారని తూర్పారపట్టారు. ఎల్ఐసీ, బ్యాంకులు, అగ్నివీర్‌లో విషయంలోనూ అబద్ధాలు చెప్పారని నిప్పులు చెరిగారు. రైతులకు ఎంఎస్‌పీ ఇవ్వడం లేదని అసత్య ప్రచారాలు చేశారని.. అయితే ఇలాంటి అబద్ధాల్ని ప్రజలు నమ్మరని కాంగ్రెస్ తెలుసుకోవాలని సూచించారు.
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి.. ఆ నేతల అబద్ధాలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. విపక్ష నేతల ప్రవర్తన సభ హుందాతనానికి మంచిది కాదని.. చిన్న పిల్లల మనస్తత్వం వీడాలని కోరారు. సభలో ఇలాంటి ప్రవర్తన ప్రజాస్వామ్యానికి శోభ ఇవ్వదని చెప్పారు. 140 కోట్ల మంది ప్రజలకు తాము నిజాలే చెప్తామన్న ఆయన.. ఎస్సీ, ఎస్టీలు, పీడిత వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని అంబేద్కర్ చెప్పారని.. నెహ్రూ ప్రభుత్వ విధానాలు నచ్చకే ఆయన రాజీనామా చేశారని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
Read Latest National News and Telugu News