PM Modi: మోదీ ఉపవాస దీక్ష ఎలా విరమించారో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..
ABN , Publish Date - Jan 23 , 2024 | 08:04 PM
అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తికాగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన 11 రోజుల ఉపవాస దీక్షను సోమవారం విరమించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మహరాజ్ అందించిన రామ 'చరణామృతం' తాగడం ద్వారా ప్రధాన తన ఉపవాసాన్ని ముగించారు.
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తికాగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తన 11 రోజుల ఉపవాస దీక్షను సోమవారం విరమించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మహరాజ్ (Govind Dev Giri Maharaj) అందించిన రామ 'చరణామృతం' (Charnamrit) తాగడం ద్వారా ప్రధాన తన ఉపవాసాన్ని ముగించారు.
ప్రాణప్రతిష్ఠ ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిరిరాజ్ మహరాజ్ ఈ ఆసక్తికరమైన విషయాన్ని భక్తులు, అతిథులతో పంచుకున్నారు. పూజాదికాల సమయంలో పాలతో చేసిన తీపి పానీయాన్ని (రామ చరణామృతం) ఉపయోగిస్తామని, ప్రధాని స్వయంగా తనను రామ చరణామృతం అడిగి దానిని తాగడం ద్వారా తన ఉపవాసాన్ని ముగించారని చెప్పారు. సహజంగా ఉపవాస దీక్ష విరమణకు తేనె, కొన్ని నిమ్మరసం చుక్కలు ఇచ్చి దీక్ష విరమింపజేస్తామని, కానీ తనకు భగవంతుని చరణామృతం ఇవ్వమని మోదీ కోరడంతో తాము ఆ మార్పులు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఆ సమయంలో తనకు తల్లిప్రేమ గుర్తుకొచ్చిందని, కన్న కొడుక్కి స్వయంగా పానీయం అందించి ఆకలి తీర్చిన అనుభూతి కలిగిందని చెప్పారు. ఉపవాస దీక్ష విషయంలో కూడా మూడు రోజుల ఉపవాసాన్ని తాము సూచించామని, అయితే 11 రోజుల పాటు రిట్యువల్స్ పూర్తయ్యేంత వరకూ ఉపవాసం ఉండాలని ప్రధాని నిర్ణయించుకున్నారని చెప్పారు. రోజుకు ఒకపూట భోజనం చేయాలని చెప్పినప్పటికీ రిట్యువల్స్ పూర్తయ్యేంత వరకూ ఘనాహారం తీసుకోరాదని ఆయన నిర్ణయించుకున్నట్టు గోవింద్ దేవ్ గిరి మహరాజ్ తెలిపారు. దైవం ఆశీస్సులు, మార్గనిర్దేశం ఉంటేనే ఇలాంటివి సాధ్యమవుతాయని ప్రధానిని శ్లాఘించారు.