Share News

Delhi: లోక్‌సభ ఎన్నికల రెండోదశ పోలింగ్‌ ముగిసింది.

ABN , Publish Date - Apr 27 , 2024 | 03:42 AM

లోక్‌సభ ఎన్నికల రెండోదశ పోలింగ్‌ శుక్రవారం ముగిసింది. భానుడు నిప్పులు కురిపిస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 88 స్థానాల్లో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు.

Delhi: లోక్‌సభ ఎన్నికల రెండోదశ పోలింగ్‌ ముగిసింది.

13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు పోలింగ్‌.. 63.5 శాతం నమోదు

  • కేరళలో ఈ దశలోనే ఎన్నికలు పూర్తి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): రాత్రి 8 గంటల వరకు 63.5 శాతం పోలింగ్‌ నమోదైందని, పూర్తి వివరాలు లభించిన అనంతరం పోలింగ్‌ శాతం పెరగవచ్చని ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. రెండో దశలో కేరళలోని మొత్తం స్థానాలు (20), కర్ణాటక (14), రాజస్థాన్‌ (13), యూపీ (8), మహారాష్ట్ర (8), మధ్యప్రదేశ్‌ (6), అస్సాం (5), బిహార్‌ (5), ఛత్తీ్‌సగఢ్‌ (3), పశ్చిమబెంగాల్‌ (3)లతోపాటు జమ్ముకశ్మీర్‌, మణిపూర్‌, త్రిపురలోని ఒక్కో స్థానానికి పోలింగ్‌ జరిగింది.


అత్యధికంగా త్రిపురలో 79.46 శాతం పోలింగ్‌ నమోదు కాగా, అత్యల్పంగా బిహార్‌లో 55.08 శాతం నమోదైంది. కాగా, రెండో దశలో 89 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగాల్సి ఉండగా 88 స్థానాలలోనే జరిగింది. మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో బరిలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి మరణించడంతో ఆ స్థానానికి పోలింగ్‌ను మే 7న జరిగే మూడోదశ ఎన్నికలతో కలిపి నిర్వహించనున్నారు. కేరళలో మొత్తం 20 సీట్లకు ఎన్నికలు జరిగాయి. దేశవ్యాప్తంగా చెదురుమదరు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని ఈసీ తెలిపింది. మధ్యప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికల విధుల్లో ఉన్న జవాన్‌ తన సర్వీస్‌ రైఫిల్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.


తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగిన మణిపూర్‌లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఆ రాష్ట్రంలో 77.32 శాతం పోలింగ్‌ నమోదు కావటం గమనార్హం. శుక్రవారం పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోయాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బిహార్‌లోని ఖగారియా, ముంగేర్‌ నియోజకవర్గాలలో ఎండ తీవ్రత కారణంగా ఓటర్లకు అధికారులు షామియానాలు ఏర్పాటు చేసి, తాగునీరు, మెడికల్‌ కిట్లను అందుబాటులో ఉంచారు.

ఛత్తీ్‌సగఢ్‌లోని బస్తర్‌, కాంకేర్‌ పార్లమెంటు స్థానాల పరిధిలోని 46 గ్రామాల ప్రజలు లోక్‌సభకు ఎన్నికలకు సంబంధించి తొలిసారిగా తమ గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ స్టేషన్లలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ పూర్తయిన అనంతరం ప్రధాని మోదీ ఎక్స్‌లో ట్వీట్‌ చేస్తూ.. ‘రెండోదశ చాలా బాగా పూర్తయ్యింది. ఎన్‌డీఏకు అద్భుతంగా లభించిన స్పందన ప్రతిపక్షాలను మరింత నిరాశపరుస్తుంది’ అన్నారు.


బరిలో ఉన్న ప్రముఖులు

రెండో దశ ఎన్నికల బరిలో పలువురు ప్రముఖులు పోటీ పడ్డారు. వీరిలో రాహుల్‌గాంధీ, శశిథరూర్‌, కేసీ వేణుగోపాల్‌, ఛత్తీ్‌సగఢ్‌ మాజీ సీఎం భూపేష్‌ బఘేల్‌, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేష్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్రమంత్రులు రాజీవ్‌ చంద్రశేఖర్‌, గజేంద్రసింగ్‌ షెకావత్‌, సినీ నటి హేమమాలిని, తేజస్వీ సూర్య, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ ఈ నెల 19న 102 స్థానాలకు జరిగింది. ఇప్పటి వరకూ మొత్తం 190 నియోజకవర్గాలకు పోలింగ్‌ పూర్తయ్యింది.

ఐదో దశ నోటిఫికేషన్‌ విడుదల

లోక్‌సభ ఎన్నికల ఐదో దశ నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదలైంది. 8 రాష్ట్రాలలోని 49 నియోజవర్గాలలో ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మే 20న పోలింగ్‌ జరుగనుంది. ఈ దశలో యూపీలోని అమేథీ, రాయబరేలీ తదితర స్థానాలున్నాయి. శుక్రవారం నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలు కాగా మే 3 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. మే 4న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.

Updated Date - Apr 27 , 2024 | 03:45 AM