Share News

Premalatha: అట్లయితేనే.. లేకుంటే లేదు.. 14 ఎంపీ సీట్లిచ్చే పార్టీతోనే పొత్తు..

ABN , Publish Date - Feb 08 , 2024 | 10:51 AM

పార్లమెంటు ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లు, రాజ్యసభ సీటు ఇచ్చే పార్టీతోనే పొత్తు ఉంటుందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) ప్రకటించారు. కోయంబేడులోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శులు, నిర్వాహకులతో ప్రేమలత సమీక్షా సమావేశం నిర్వహించారు.

Premalatha: అట్లయితేనే.. లేకుంటే లేదు.. 14 ఎంపీ సీట్లిచ్చే పార్టీతోనే పొత్తు..

- డీఎండీకే చీఫ్‌ ప్రేమలత

ప్యారీస్‌(చెన్నై): పార్లమెంటు ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లు, రాజ్యసభ సీటు ఇచ్చే పార్టీతోనే పొత్తు ఉంటుందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) ప్రకటించారు. కోయంబేడులోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శులు, నిర్వాహకులతో ప్రేమలత సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న విజయకాంత్‌(Vijayakanth) సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. తర్వాత ప్రేమలత అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో ప్రిసీడియం చైర్మన్‌ డాక్టర్‌ ఇళంగోవన్‌, ఉపకార్యదర్శులు ఎల్కే సుధీష్‌, పార్థసారథి, ప్రచార విభాగం కార్యదర్శి మోహన్‌రాజ్‌ సహా 82 జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలి అన్న అంశంపై జిల్లా కార్యదర్శులు తమ అభిప్రాయాలు తెలియజేశారు. కొంతమంది బీజేపీతో, మరికొందరు అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకోవాలని సలహాలిచ్చారు. సమావేశంలో పాల్గొన్న నేతలందరూ తమ అభిప్రాయాలను తెలియజేసిన అనంతరం పది తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. విజయకాంత్‌ అంత్యక్రియల్లో పాల్గొన్న రాజకీయ పార్టీల నేతలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం ఆమోదించారు. విజయకాంత్‌ సమాధిని ఆలయంగా నిర్మించాలని, ఈ నెల 12వ తేది అన్ని జిల్లాల్లో పార్టీ జెండా ఎగురవేయాలని, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఎవరితో పొత్తు కుదుర్చుకోవాలి, అభ్యర్థుల ఎంపిక అధికారాన్ని ఈ సమావేశం ప్రేమలతకు అప్పజెప్పింది.

nani2.jpg

అధిక స్థానాలు...

సమావేశం అనంతరం ప్రేమలత మీడియాతో మాట్లాడుతూ... 2014 పార్లమెంటు ఎన్నికల్లోలాగే డీఎండీకేకు అధిక స్థానాలు కేటాయించే పార్టీలతోనే కూటమి ఉంటుందని, ఈనెల 12వ తేదిలోపు పొత్తుల ఖరారుపై అధికారపూర్వకంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. సోషల్‌ మీడియాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పలు పార్టీలతో సీట్ల పంపకంపై ప్రసారమయ్యే కథనాల్లో వాస్తవం లేదని, తమ పార్టీ ఎవరితోనూ పొత్తు గురించి సంప్రదింపులు జరపలేదన్నారు. పార్లమెంటుకు జరుగనున్న ఎన్నికల్లో తాము కోరిన 14 ఎంపీ సీట్లు, ఒక రాజ్యసభ సీటు కేటాయించే పార్టీతో పొత్తు ఉంటుందని, తమ పార్టీ సిద్ధాంతాల వల్ల డీఎండీకేకు ప్రజాదరణతో పాటు ఓటు బ్యాంక్‌ కూడా పెరిగిందన్నారు. కొత్త పార్టీ ప్రారంభించిన నటుడు విజయ్‌ను ఆహ్వానిస్తూ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Feb 08 , 2024 | 10:51 AM