Share News

Prime Minister Modi : కాంగ్రెస్‌, ఎస్పీ వస్తే.. రామాలయంపైకి బుల్డోజర్‌!

ABN , Publish Date - May 18 , 2024 | 06:04 AM

కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలకు అధికారం ఇస్తే అయోధ్యలో నిర్మించిన రామాలయంపైకి బుల్డోజర్‌ను పంపుతాయని ప్రధాని మోదీ అన్నారు. బుల్డోజర్లను ఎక్కడ నడపాలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వద్ద ట్యూషన్‌ చెప్పించుకోవాలని సూచించారు.

 Prime Minister Modi : కాంగ్రెస్‌, ఎస్పీ వస్తే..  రామాలయంపైకి బుల్డోజర్‌!

బారాబంకీ, మే 17: కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలకు అధికారం ఇస్తే అయోధ్యలో నిర్మించిన రామాలయంపైకి బుల్డోజర్‌ను పంపుతాయని ప్రధాని మోదీ అన్నారు. బుల్డోజర్లను ఎక్కడ నడపాలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వద్ద ట్యూషన్‌ చెప్పించుకోవాలని సూచించారు. శుక్రవారం ఆయన ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో జరిగిన పలు ప్రచార సభల్లో ప్రసంగించారు.

దేశంలో అస్థిరత సృష్టించడానికే ‘ఇండీ’ కూటమి ఎన్నికల బరిలో నిలిచిందన్నారు. పోలింగ్‌ నడిచేకొద్దీ కూటమి పేకమేడలా కూలిపోతోందని.. బీజేపీ కేంద్రంలో హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వంలో పేదలు, యువత, రైతులు, మహిళల కోసం చాలా భారీ నిర్ణయాలు తీసుకోవలసి ఉందని చెప్పారు. ‘జూన్‌ 4 (ఓట్ల లెక్కింపు) ఎంతో దూరంలో లేదు.

మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్‌ కొట్టబోతోందని ప్రపంచం మొత్తానికీ తెలిసిపోయింది. ప్రజల కోసం, వారి మేలు కోసం పనిచేసే ఎంపీలు కావాలి. ఐదేళ్లపాటు మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఎంపీలు కావాలి.. ఐదేళ్లూ మోదీని తిట్టిపోసేవాళ్లు కాదు. 100సీసీ ఇంజన్‌తో 1000 సీసీ వేగం సాధించగలరా? శీఘ్ర అభివృద్ధి కోరుకునేటట్లయితే శక్తిమంతమైన బీజేపీ ప్రభుత్వాన్నే ఎన్నుకోవాలి’ అని పిలుపిచ్చారు.

శ్రీరామనవమి రోజు ఎస్పీ సీనియర్‌ నేత ఒకరు రామాలయం పనికిమాలినదని అన్నారని.. రామాలయానికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మార్పించేందుకు కాంగ్రెస్‌ సన్నద్ధంగా ఉందని మోదీ ఆరోపించారు. వారికి కుటుంబం, అధికారం తప్ప ఇంకేవీ పట్టవన్నారు.


‘ఈ రెండు పార్టీలకు తమ ఓటుబ్యాంకు కంటే మించింది లేదు. వాటి బండారాన్ని నేను బయటపెడుతుండడంతో మోదీ హిందూ-ముస్లిం విభజన తెస్తున్నారని రచ్చచేస్తున్నారు. ఇప్పుడా ఓటుబ్యాంకు కూడా క్రమంగా అసలు నిజాలు తెలుసుకుంటోంది. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ట్రిపుల్‌ తలాక్‌ చట్టంతో మన తల్లులు, సోదరీమణులంతా సంతోషంగా ఉన్నారు. బీజేపీని ఆశీర్వదిస్తున్నారు.

యూపీ మేనల్లుడి(అఖిలేశ్‌)కి కొత్త మేనత్త (బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ) దొరికింది. ఇండీ కూటమికి బయటి నుంచి మద్దతిస్తామంటోంది’ అని ఎద్దేవాచేశారు (గత లోక్‌సభ ఎన్నికల సమయంలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతితో జట్టుకట్టిన అఖిలేశ్‌ ఆమెను బువా అంటే మేనత్త అని పిలిచేవారు). ప్రధాని పదవిపై కాంగ్రెస్‌ వాళ్లు పగటి కలలు కంటున్నారని ధ్వజమెత్తారు.

రాహుల్‌గాంధీ పోటీచేస్తున్న రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజలు తమ ఎంపీని గాక దేశ ప్రధానిని ఎన్నుకుంటున్నారని ఛత్తీ్‌సగఢ్‌ మాజీ సీఎం భూపేశ్‌ బఘేల్‌ చేసిన వ్యాఖ్యలను ఎద్దేవాచేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్‌ ఇవ్వరాదని రాజ్యాంగ సభ స్పష్టం చేసిందని.. కానీ ఇండీ కూటమి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను లాక్కుని తమ ఓటుబ్యాంకుకు కట్టబెట్టాలని చూస్తోందని ధ్వజమెత్తారు.

Updated Date - May 18 , 2024 | 06:05 AM