Prime Minister Modi: పాక్ శక్తి ఏంటో చూశానులే..
ABN , Publish Date - May 25 , 2024 | 06:13 AM
పాకిస్థాన్ శక్తి ఏపాటిదో తెలుసుకోవడానికి స్వయంగా అక్కడకు వెళ్లానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తాను 2015లో పాకిస్థాన్‌లో హఠాత్తుగా వీసా కూడా లేకుండా పర్యటన జరిపినట్టు తెలిపారు. దీనిపై అక్కడి విలేకరులు ప్రశ్నించగా, ‘ఇది ఒకానొక కాలంలో (అవిభాజ్య భారతదేశం)నా దేశమే’’నని చెప్పానన్నారు.
వీసా లేకుండానే అక్కడ పర్యటించా.. అక్కడి విలేకరులు అడిగితే ఇది ఒకప్పుడు మా దేశమేనని చెప్పా
మణిశంకర్ అయ్యర్ ‘పాక్ బాంబు’ వ్యాఖ్యలపై పరోక్షంగా మోదీ ఫైర్
న్యూఢిల్లీ, మే 24: పాకిస్థాన్ శక్తి ఏపాటిదో తెలుసుకోవడానికి స్వయంగా అక్కడకు వెళ్లానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తాను 2015లో పాకిస్థాన్‌లో హఠాత్తుగా వీసా కూడా లేకుండా పర్యటన జరిపినట్టు తెలిపారు. దీనిపై అక్కడి విలేకరులు ప్రశ్నించగా, ‘ఇది ఒకానొక కాలంలో (అవిభాజ్య భారతదేశం)నా దేశమే’’నని చెప్పానన్నారు. పాకిస్థాన్ వద్ద అణుబాంబు ఉందనే విషయం ఆ దేశంతో వ్యవహరించేటప్పుడు భారత్ గుర్తు పెట్టుకోవాలన్న కాంగ్రెస్ సీనియర్ మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై ఆయన ఇలా స్పందించారు.
ఓ జాతీయ ఇంగ్లిష్ చానల్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ పంజాబ్‌లో ఎన్నికల ప్రచార సభల్లోనూ దీనిపై మోదీ మాట్లాడారు. ‘‘పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఉగ్రవాదులను అంతంచేస్తే ఆదేశంలో వాళ్లు బాధపడాలి. కానీ మనదేశంలో కూడా కొందరు ఆందోళనకు గురి అవుతుంటారు. ఎందుకనేది నాకు అసలు అర్థం కాదు’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ముస్లిం రిజర్వేషన్లు, ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాల్లో మార్పులేని తన వైఖరిని మరోసారి ఆయన స్పష్టం చేశారు.
చివరకు ముంబై దాడులను సైతం పాకిస్థానీయులుకాదు, భారతీయులే జరిపారనేదాకా కొందరు వెళ్లారని, ఇంతకుమించిన సిగ్గుమాలిన ప్రకటన ఉండదంటూ ఓ కాంగ్రెస్ నేతపై మోదీ విరుచుకుపడ్డారు. కాగా ఏడో విడత ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లోని పటియాలా సహా పలు నియోజకవర్గాల్లో శుక్రవారం ప్రచార సభల్లో మోదీ పాల్గొన్నారు.
మరోవైపు విపక్షాలను తాను శత్రువులుగా పరిగణించబోనని, ప్రతిపక్షాలతో కలిసి పనిచేయాలని తాను కోరుకుంటానని మోదీ అన్నారు. అనుభవమున్న ప్రతిపక్ష నేతల నుంచి నిర్మాణాత్మక విమర్శలను తీసుకునేందుకు తానెప్పుడూ సిద్ధంగానే ఉంటానని తెలిపారు. శుక్రవారం ఓ జాతీయ ఇంగ్లిష్ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన విపక్షాల దాడులు, తదితర విషయాలపై మాట్లాడారు.