Share News

PM Modi: ప్రపంచం మెుత్తం ఇండియా వైపు చూస్తోంది: ప్రధాని మోదీ..

ABN , Publish Date - Oct 28 , 2024 | 08:13 PM

భారతదేశంలో ఉన్న విస్తృత అవకాశాలపై ఇప్పుడు ప్రపంచ దేశాలు చర్చిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. మనం అంతర్జాతీయ వేదికలపై మాట్లాడుతుంటే పలు దేశాలు ఎంతో ఆతృతగా వింటున్నాయని చెప్పారు.

PM Modi: ప్రపంచం మెుత్తం ఇండియా వైపు చూస్తోంది: ప్రధాని మోదీ..

గుజరాత్: ప్రపంచం మెుత్తం నేడు భారతదేశం వైపు చూస్తోందని, పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. వివిధ దేశాల నేతలు మనకు స్నేహ హస్తం అందించేందుకు ఆశగా ఎదురు చూస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా లాతీ ప్రాంతంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా రూ.4,800 కోట్లతో పెద్దఎత్తున అభివృద్ధి పనులను మోదీ ప్రారంభించారు.


భారతదేశంలో ఉన్న విస్తృత అవకాశాలపై ఇప్పుడు ప్రపంచ దేశాలు చర్చిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. మనం అంతర్జాతీయ వేదికలపై మాట్లాడుతుంటే పలు దేశాలు ఎంతో ఆతృతగా వింటున్నాయని చెప్పారు. ఇటీవల రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న దేశాలు మనతో చేతులు కలిపేందుకు, భాగస్వామం అయ్యేందుకు ఉవిళ్లూరుతున్నాయని ప్రధాని చెప్పుకొచ్చారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశాలపై ప్రతీ దేశం తమను అడుగుతున్నాయని తెలిపారు. ప్రపంచ వేదికలపై భారత్ హవా నడుస్తోందని ప్రధాని మోదీ చెప్పారు.


ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ తమ దేశం ప్రతి సంవత్సరం 90వేల మంది భారతీయులకు వీసాలు మంజూరు చేస్తుందని ఢిల్లీ వేదికగా ప్రకటించారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఈ మేరకు అవకాశాలు పొందేందుకు నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన బాధ్యత దేశ యువతపై ఉందని ఆయన అన్నారు. మనం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రపంచ వేదికలపై భారతదేశం ప్రభావం పెరుగుతోందని చెప్పుకొచ్చారు. ప్రపంచం మొత్తం భారతదేశాన్ని కొత్త కోణంలో చూస్తోందని అన్నారు. విదేశీలు ఇండియా సామర్థ్యాన్ని గుర్తించడం ప్రారంభించారని ప్రధాని చెప్పుకొచ్చారు. నేడు ప్రపంచం మొత్తం మనం చెప్పిన ప్రతి విషయాన్ని శ్రద్ధగా వింటోందని మోదీ అన్నారు.


అమ్రేలి జిల్లాలో 2007లో డెయిరీ కోఆపరేటివ్‌ను ప్రారంభించినప్పుడు దానికి అనుబంధంగా కేవలం 25 గ్రామాలు మాత్రమే ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. నేడు ఆ సంఖ్య 700లకు చేరుకుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సారథ్యంలో అమ్రేలి జిల్లాలోని ఓడరేవులు బాగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పుకొచ్చారు. గుజరాత్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి:

World Record: మరో ప్రపంచ రికార్డుకు సిద్ధమైన చెఫ్.. అసలు విషయం ఇదే..

Priyanka Gandhi: మదర్ థెరిస్సా మా ఇంటికి వచ్చారు.. నాటి జ్ఞాపకాలను పంచుకున్న ప్రియాంక

Bandra Stampede: తొక్కిసలాటకు ముందు జరిగిందిదే.. సీసీటీవీ ఫుటేజ్ వెల్లడి

Updated Date - Oct 28 , 2024 | 08:15 PM