ఆరేళ్ల బాలికపై ప్రిన్సిపాల్ అత్యాచార యత్నం
ABN , Publish Date - Sep 25 , 2024 | 02:25 AM
ఆ చిన్నారి వయసు ఆరేళ్లు. ఒకటో తరగతి చదువుతోంది. తాను చదువుతున్న పాఠశాల ప్రిన్సిపాల్ తెలిసిన వ్యక్తి కావడంతో ఆయన కారులోనే ప్రతి రోజూ బడికి వెళ్లేది.
ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య
అహ్మదాబాద్, సెప్టెంబరు 24: ఆ చిన్నారి వయసు ఆరేళ్లు. ఒకటో తరగతి చదువుతోంది. తాను చదువుతున్న పాఠశాల ప్రిన్సిపాల్ తెలిసిన వ్యక్తి కావడంతో ఆయన కారులోనే ప్రతి రోజూ బడికి వెళ్లేది. 55 ఏళ్ల వయసు ఉన్న ఆ ప్రిన్సిపాల్ గురువారం చిన్నారిని బడికి తీసుకువెళ్తూ కారులోనే ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక ప్రతిఘటించి కేకలు వేయడంతో గొంతు నులిమి చంపేశాడు. గుజరాత్‌లోని దహోద్ జిల్లా తురానీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలికను చంపిన నిందితుడు శవాన్ని కారులోనే ఉంచి డోర్ లాక్ చేశాడు. సాయంత్రం 5.30 గంటలకు శవాన్ని ప్రహరీ పక్కన ఉన్న చెట్ల పొదల్లో పడేశాడు. ఆ పాప ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను ప్రశ్నించగా.. ఆమెను ఇంటి వద్ద దించి వేసి వేరే పనిమీద వెళ్లిపోయానని చెప్పాడు. మరుసటి రోజు కూడా చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రిన్సిపాల్‌ను విచారించగా అసలు విషయం చెప్పాడు.