Priyanaka Gandhi: వయనాడ్‌లో ప్రియాంక ఓటమికి వామపక్షాల ప్లాన్.. వర్కౌట్ అవుతుందా..
ABN , Publish Date - Oct 18 , 2024 | 05:58 PM
వయనాడ్ లోక్‌సభ స్థానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ అగ్రనేత, సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. 2019 నుంచి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన వయనాడ్ స్థానంలో ఆయన సోదరి ప్రియాంక పోటీ చేయబోతున్నారు. దీంతో ఈ లోక్‌సభ సీటు అందరి దృష్టిని..
మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభ ఎన్నికల వేళ దేశంలోని వయనాడ్ లోక్‌సభ స్థానంతో పాటు పలు శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో పాటు వయనాడ్ లోక్‌సభ స్థానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ అగ్రనేత, సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. 2019 నుంచి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన వయనాడ్ స్థానంలో ఆయన సోదరి ప్రియాంక పోటీ చేయబోతున్నారు. దీంతో ఈ లోక్‌సభ సీటు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు ప్రియాంక గాంధీని సమర్థంగా ఎదుర్కోవడానికి వామపక్షాలతో పాటు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నియోజకవర్గంలో సరైన అభ్యర్థిని నిలబెట్టేందుకు బీజేపీ కసరత్తు చేస్తుండగా.. సీపీఐ ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించింది. ఈ పరిణామాలు కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానాన్ని గాంధీ కుటుంబానికి కంచుకోటగా మార్చాలని చూస్తున్న కాంగ్రెస్‌ను టెన్షన్ పెడుతోంది. వయనాడ్ నుంచి బలమైన అభ్యర్థులను నిలబెట్టి తొలి ఎన్నికల్లోనే ప్రియాంకను కట్టడి చేయాలని సీపీఐ, బీజేపీ భావిస్తున్నాయి.
రాహుల్ పోటీతో..
2019లో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేయడంతో కేరళలోని ఈ లోక్‌సభ స్థానం రాజకీయంగా కీలకంగా మారింది. ఈ ఎన్నికలలో రాహుల్ తన సాంప్రదాయ అమేథీ స్థానం నుండి ఓడిపోయి, వయనాడ్‌లో గెలిచారు. 2024లో రాహుల్ గాంధీ రాయబరేలీతో పాటు వయనాడ్‌లో పోటీచేసి.. రెండు స్థానాల్లో గెలిచారు. రెండు లోక్‌సభ స్థానాలకు ఒకే అభ్యర్థి ఎంపీగా ఉండేందుకు భారత ఎన్నికల నియమావళి అంగీకరించకపోవడంతో.. వయనాడ్ స్థానాన్ని రాహుల్ గాంధీ వదులుకున్నారు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువడటానికి ముందే కాంగ్రెస్ తమ అభ్యర్థిగా వయనాడ్ నుంచి ప్రియాంకగాంధీని ప్రకటించింది. 2019లో అధికారికంగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రియాంక గాంధీ గెలుపు కోసం కష్టపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
ఇబ్బందులు ఇవే..
రాహుల్ గాంధీ కారణంగా వయనాడ్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వయనాడ్‌కు దాదాపు 6 నెలలుగా ఎంపీ లేరనే విషయాన్ని వామపక్షాలతో పాటు బీజేపీ తమ ప్రచారస్త్రంగా మార్చుకున్నాయి. 2019తో పోలిస్తే 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ గెలుపు ఆధిక్యత తగ్గింది. 2019లో రాహుల్ 4 లక్షల 19 వేల తేడాతో గెలుపొందగా.. 2024లో 3 లక్షల 64 వేల మెజార్టీ మాత్రమే సాధించారు. దీంతో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా మెజార్టీ భారీగా తగ్గుతుందనే ప్రచారం జరుగుతోంది.
సీపీఐ నుంచి..
వామపక్షాల నుంచి ఉమ్మడి అభ్యర్థిగా సీపీఐ నేత సత్యన్ మొకేరిని పోటీకి దింపింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా భార్య అన్నీ రాజా పోటీచేశారు. ఈసారి సీపీఐ స్థానికంగా బలమైన నాయకుడు సత్యన్ మొకేరిని రంగంలోకి దించింది. సత్యన్ మొకేరి కోజికోడ్‌లోని నాదపురం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేరళ వామపక్ష రాజకీయాల్లో బలమైన నాయకుడిగా ఉన్నారు.. వామపక్ష విద్యార్థి విభాగం నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మొకేరి అఖిల భారత కిసాన్ సభకు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వం వయనాడ్ ఎంపీగా మొకేరి పేరు ప్రకటిస్తూ ప్రియాంక గాంధీ ఎన్నికల్లో ఓడిపోతారని ప్రకటించారు.
బీజేపీ కసరత్తు..
వయనాడ్‌లో సరైన అభ్యర్థి కోసం బీజేపీ అన్వేషిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్‌లో బీజేపీకి 13 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఓట్ల శాతాన్ని పెంచుకునేందుకు బీజేపీ వయనాడ్‌లో బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. 2024లో రాహుల్ గాంధీపై బీజేపీ కె సురేంద్రన్‌ను రంగంలోకి దించింది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు. సరైన సమయంలో సరైన అభ్యర్థిని ప్రకటిస్తామని కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎంటీ రమేష్ తెలిపారు. మహిళా అభ్యర్థిని పోటీకి దింపాలని బీజేపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో బీజేపీ కూడా రెండు లేదా మూడు రోజుల్లో తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వామపక్షాలు, బీజేపీ నుంచి ప్రియాంక గాంధీ ఎలాంటి పోటీ ఎదుర్కొంటారనేది వేచి చూడాలి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here