Share News

Rahul Gandhi : ఖర్గేను, నన్ను తోసేశారు

ABN , Publish Date - Dec 20 , 2024 | 03:52 AM

అంబేడ్కర్‌పై అమిత్‌షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని.. గురువారం పార్లమెంటులో చోటుచేసుకున్న ఘటనలు అందులో భాగమేనని కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు.

Rahul Gandhi : ఖర్గేను, నన్ను తోసేశారు

బీజేపీ ఎంపీలు కర్రలు చేతబట్టి సభలోకి వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకున్నారు

అంబేడ్కర్‌పై అమిత్‌ షా వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ యత్నం

బీజేపీ, ఆరెస్సెస్‌ ఆలోచనాసరళి ఎప్పుడూ రాజ్యాంగానికి, అంబేడ్కర్‌కు వ్యతిరేకం

లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ ఆగ్రహం

షా క్షమాపణ, రాజీనామాకు డిమాండ్‌

నన్ను నెట్టారు.. బ్యాలెన్స్‌ తప్పి కిందపడ్డా

రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే

దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరిక

న్యూఢిల్లీ, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్‌పై అమిత్‌షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని.. గురువారం పార్లమెంటులో చోటుచేసుకున్న ఘటనలు అందులో భాగమేనని కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌ సమావేశాలకు ముందు అదానీ లంచం ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైందని.. దాని పై చర్చించాలని తాము కోరామని, కానీ ఆ చర్చ జరగకుండా సమావేశాలు మొదలైనప్పటి నుంచీ బీజేపీ ఇదే పనిచేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ, ఆరెస్సెస్‌ ఆలోచనాసరళిఎప్పుడూ రాజ్యాంగం, అంబేడ్కర్‌కు వ్యతిరేకంగా ఉంటుందని.. అందుకే ఆయన జ్ఞాపకాలను చెరిపివేయాలని కోరుకుంటున్నాయని రాహుల్‌ మండిపడ్డారు. ‘‘కేంద్ర హోంమంత్రి తన వ్యాఖ్యల ద్వారా తన ఆలోచనా తీరును బయటపెట్టుకున్నారు. ఆయన క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని మేం డిమాండ్‌ చేశాం. కానీ ఆ రెండూ జరగలేదు. ఇవాళ వాళ్లు ఒక కొత్త గత్తరకు తెరతీశారు. మేం అంబేడ్కర్‌ విగ్రహం నుంచి పార్లమెంటు హౌస్‌కు వెళ్తున్న సమయంలో.. బీజేపీ ఎంపీలు చేతుల్లో కర్రలు పట్టుకుని మెట్ల వద్ద నిలబడి, మమ్మల్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు’’అని తెలిపారు. ‘‘నేను పార్లమెంటులోకి వెళ్తుంటే బీజేపీ ఎంపీలు నన్ను అడ్డుకుని, తోసేస్తూ బెదిరించారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ఖర్గే, ప్రియాంకను కూడా తోసేశారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘అది కూడా జరిగింది. కానీ, ఈ తోపులాటలకు మేం బెదరం’’అని రాహుల్‌ స్పష్టంచేశారు. పార్లమెంటు మకర ద్వారాన్ని చూపుతూ.. ‘‘ఇది పార్లమెంటులోకి ప్రవేశించే ద్వారం. లోపలికి వెళ్లడానికి మాకు హక్కుంది. బీజేపీ సభ్యులు మమ్మల్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశా రు. అంబేడ్కర్‌ను అవమానించిన అమిత్‌ షా.. అందుకు క్షమాపణ చెప్పి, రాజీనామా చేసి తీరాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ప్రధాని మన దేశాన్ని అదానీకి తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు.


అంతా వాళ్లే చేసి..

అంబేడ్కర్‌పై షా వ్యాఖ్యలను మల్లికార్జున్‌ ఖర్గే తీవ్రంగా ఖండించారు. ‘‘తాను తప్పు చేసినట్టు ఒప్పుకోవడానికి ఆయన (అమిత్‌ షా) నిరాకరిస్తున్నారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాం. ఆయన్ను పదవి నుంచి తొలగించాలని ప్రధాని మోదీని కోరాం. అదీ జరగలేదు. అందుకే రాహుల్‌, ప్రియాంక సహా మా పార్టీ నేతలందరం నిరసన తెలిపాం. బీజేపీ ఈ అంశాన్ని పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తోంది’’అని ఖర్గే అన్నారు. ఆ కుట్రలో భాగంగానే బీజేపీ ఎంపీలు తమపై దాడి చేశారన్నారు. ‘‘మేమెంతో క్రమశిక్షణతో ఒక వరుసలో వస్తున్నాం. వాళ్ల(బీజేపీ) మనసులో ఏముందో నాకు తెలియదు. మకర ద్వారం వైపు వచ్చి మాకు అడ్డు తగిలారు. పార్లమెంట్‌ లోపలికి వెళ్లాలని మేం అనుకున్నాం. కానీ వారు తలుపుల వద్ద మమ్మల్ని ఆపేశారు. పురుష ఎంపీలు కండబలాన్ని చూపించారు. మాతో వస్తున్న మహిళా ఎంపీలను సైతం అడ్డుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే మాపై దాడి చేశారు. వారు నన్ను నెట్టేసరికి నేను కిందపడిపోయా ను’’అని ఖర్గే తెలిపారు. ‘‘ఇదంతా వాళ్లే చేసి.. మేమే వాళ్లను తోసేసి, వారి గాయాలకు కారణమయ్యామంటూ మాపై ఆరోపణలు చేస్తున్నారు. మమ్మల్ని చూసి హేళన చేస్తున్నారు’’ అన్నారు. అంబేడ్కర్‌ను అమిత్‌షా అవమానించారని, దీనిపై దేశవ్యాప్త ఉద్య మం చేస్తామని తెలిపారు. ‘‘తిన్నది లేదు తాగింది లేదు.. 12 అణాల గ్లాస్‌ పగలగొట్టాడు’’అని హైదరాబాద్‌లో అంటుంటారని..బీజేపీ వాళ్లు చేస్తున్నది అలాగే ఉందని ఖర్గే అన్నారు.

ఇదిలా ఉండగా.. అంబేడ్కర్‌పై అమిత్‌షా వివాదాస్పద వ్యాఖ్యల వీడియోను డిలీట్‌ చేయాలంటూ ‘ఎక్స్‌’కు కేంద్రం తాఖీదునిచ్చిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. కేంద్రం ఇలా అడుగుతోందంటూ ‘ఎక్స్‌’ నుంచి తమకు ఒక ఈ మెయిల్‌ వచ్చిందని ఆ పార్టీ సోషల్‌ మీడియా అండ్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ చైర్‌పర్సన్‌ సుప్రియ తెలిపారు. అయితే.. ‘ఎక్స్‌’ ఆ వీడియోలను తొలగించలేదని ఆమె చెప్పారు.

నేనెప్పుడు తెల్లటి టీ-షర్టులే వేసుకొం టాను. పారదర్శకతకు, దృఢత్వానికి, సరళత్వానికి తెలుపు దనం ప్రతీక.. మొన్న జూన్‌ 19న తన 54వ పుట్టిన రోజు సందర్భంగా ఈ మాటలు చెప్పిన రాహుల్‌ గురువారం హఠాత్తు గా నీలిరంగు టీ-షర్టులో కనిపించి అందర్నీ అశ్చర్యచకితుల్ని చేశారు. అంబేడ్కర్‌కు నచ్చినది దళిత జాతికి గుర్తింపు తెచ్చినదీ నీలిరంగే. రాజ్యాం గం, అంబేడ్కర్‌ అంశాలపై రాజకీయ రచ్చ నేపథ్యం లో రాహుల్‌ ఇలా నీలిరంగు టీ-షర్టుకు మారిపోవడం ప్రాధాన్యం ఉన్న పరిణామమే!

షాను కాపాడే కుట్రలో భాగమే: ప్రియాంక

బీజేపీ ఎంపీని రాహుల్‌గాంధీ తోసేశారంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలు అమిత్‌షాను కాపాడేందుకు ఆ పార్టీ పన్నిన కుట్రగా ప్రియాంకా గాంధీ అభివర్ణించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విపక్ష ఎంపీలను పార్లమెంటులో ప్రవేశించకుండా అడ్డుకునేందుకు అధికారపార్టీ ఎంపీలు గూండాగిరీకి పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు. బీజేపీ ఎంపీ ప్రతా్‌పచంద్ర సారంగిని రాహుల్‌ తోసేశారన్న బీజేపీ ఆరోపణను ఆమె తోసిపుచ్చారు. రాహుల్‌.. అంబేడ్కర్‌ చిత్రపటాన్ని పట్టుకుని ‘జై భీమ్‌’ అని నినదిస్తూ శాంతియుతంగా పార్లమెంటులోకి వెళ్తుండగా ఆయన్ను అడ్డుకున్నారని పేర్కొన్నారు. తన కళ్ల ముందే వారు ఖర్గేను తోసేస్తే ఆయన కింద పడిపోయారన్నారు. అంబేడ్కర్‌పై బీజేపీ అసలు ఆలోచనలు.. అమిత్‌షా వ్యాఖ్యల రూపంలో బయటపడ్డాయన్నారు. ‘‘దేశానికి రాజ్యాంగాన్ని, కోట్లాది మంది దళితులు, అణగారినవర్గాల ప్రజల జీవితాలను మార్చేసిన అంబేడ్కర్‌ను బీజేపీ తన ఆలోచనలు, చర్యలతో అవమానిస్తోంది’’అని ప్రియాంక ట్వీట్‌ చేశారు.

Updated Date - Dec 20 , 2024 | 03:53 AM