Share News

‘కామ్‌ కీ బాత్‌’పై మాట్లాడరేం?

ABN , Publish Date - Sep 24 , 2024 | 03:03 AM

ప్రధాని మోదీ ‘మనసులోని మాటల’ను చెబుతున్నారే తప్ప ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు సంబంధించిన ‘పనుల మాటల’ను మాట్లాడడం లేదని విపక్ష నేత, కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు.

‘కామ్‌ కీ బాత్‌’పై మాట్లాడరేం?

  • ప్రధాని మోదీపై రాహుల్‌ విమర్శలు

  • ఆర్డర్‌ వేయండి.. మీ ముందు నిలబడుతా

  • కశ్మీర్‌ వాసులకు రాహుల్‌ గాంధీ హామీ

శ్రీనగర్‌, సెప్టెంబరు 23: ప్రధాని మోదీ ‘మనసులోని మాటల’ను చెబుతున్నారే తప్ప ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు సంబంధించిన ‘పనుల మాటల’ను మాట్లాడడం లేదని విపక్ష నేత, కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. శ్రీనగర్‌లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ మోదీ ‘మన్‌ కీ బాత్‌’కే పరిమితమయ్యారే తప్ప ‘కామ్‌ కీ బాత్‌’ను పట్టించుకోవడం లేదని అన్నారు. ధరల పెరుగుదలను ప్రస్తావించడం లేదని చెప్పారు. దేశ రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ... మోదీ ముఖకవళికల్లో మార్పులు వచ్చాయని అన్నారు. ‘‘గత లోక్‌సభ ఎన్నికల్లో ‘56 అంగుళాల ఛాతీ’ గురించి మీరు వినేవారు. ఆ మాటలు ఇప్పుడు వినబడుతున్నాయా? ఆయన ముఖ కవలిళికలు, మూడ్‌ మారాయి. మోదీ మనస్తత్వాన్ని కాంగ్రెస్‌, ఇండియా కూటములు కలిసి మార్చేశాయి’’ అని వ్యాఖ్యానించారు. గత పదేళ్లుగా బీజేపీ దేశంలో విభజనను, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు.

జమ్మూ-కశ్మీర్‌ రాష్ట్ర హోదాను కేంద్రపాలిత ప్రాంతానికి తగ్గించి ప్రజల హక్కులను హరించి వేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. పార్లమెంటులో కశ్మీర్‌ గొంతుకనవుతానని అన్నారు. జమ్మూ-కశ్మీర్‌ మన్‌ కీ బాత్‌ను ఎవరూ వినడం లేదని చెప్పారు. అందుకే ‘‘ఏ అవసరం ఉన్నా నాకు ఆర్డర్‌ వేయండి. మీ ముందు వచ్చి నిలబడుతా. మీతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది.

అదేమిటో మీకు చెప్పాల్సిన పనిలేదు’’ అని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం 25 పారిశ్రామికవేత్తలకు చెందిన రూ.16లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించారు. తర్వాత రాహుల్‌ హిందీలో ట్వీట్‌ చేస్తూ బీజేపీని బహుజన వ్యతిరేకి అని విమర్శించారు. కులగణన అన్న మాటను పలకడానికే ప్రధాని మోదీ భయపడుతున్నారని ఆరోపించారు. బీజేపీ ఎంతగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లకు హాని కలగకుండా చూస్తామని తెలిపారు. సమగ్రమైన కుల గణన జరిపి, దాని ఆధారంగా రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. బహుజనులకు హక్కులు కల్పించడం రాజకీయ సమస్య కాదని, తన జీవితాశయమని స్పష్టం చేశారు.

Updated Date - Sep 24 , 2024 | 06:36 AM