Rahul Gandhi: రెస్టారెంట్‌కి రాహుల్... అనుకోని అతిథి రావడంతో సిబ్బంది షాక్
ABN , Publish Date - Jun 13 , 2024 | 07:14 AM
లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గణనీయమైన సీట్లు సాధించడంతో జోష్ మీదున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఆయన యూపీలోని రాయ్‌బరేలి, కేరళలోని వయనాడ్ రెండు లోక్ సభ స్థానాల నుంచి రాహుల్ ఘన విజయం సాధించారు.
వయనాడ్: లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గణనీయమైన సీట్లు సాధించడంతో జోష్ మీదున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఆయన యూపీలోని రాయ్‌బరేలి, కేరళలోని వయనాడ్ రెండు లోక్ సభ స్థానాల నుంచి రాహుల్ ఘన విజయం సాధించారు. రెండింట్లో ఒకే సీటు నుంచి ప్రాతినిధ్యం వహించాల్సి ఉండగా.. రాహుల్ దేన్ని వదులుకుంటారోననే ఆసక్తి దేశవ్యాప్తంగా ఉంది. ఈ క్రమంలో ఓటర్లకు ధన్యవాదాలు తెలిపేందుకు రాహుల్ బుధవారం నుంచి వయనాడ్‌లో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన కోజికోడ్ జిల్లాలోని తామరస్సేరి రెస్టారెంట్‌లోకి వెళ్లి.. వంటలు చేస్తున్న సిబ్బందిని పలకరించారు. సదరు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రెస్టరెంట్‌లోని చెఫ్‌లు, సిబ్బందితో మాట్లాడిన తరువాత వారితో కలిసి ఫొటోలు దిగారు. "తెర వెనక నిశ్శబ్దంగా పని చేసే వ్యక్తులకు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోతాం. వారిని కలవడానికే వచ్చాను. ఇంత మంచి భోజనం వడ్డిస్తున్న చెఫ్‌లు, సిబ్బందికి ధన్యవాదాలు" అని సోషల్ మీడియాలో చేసిన పోస్టులో రాసుకొచ్చారు.
మోదీపై తీవ్ర విమర్శలు..
కేరళలోని వయనాడ్‌లో బుధవారం జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం తర్వాత వయనాడ్‌లో తొలిసారి పర్యటించారు. ‘‘ఇప్పుడు చూసేది పాత మోదీని కాదు. మోదీ వేసుకున్న పథకాలను ఇండియా కూటమి ధ్వంసం చేసేసింది’’ అని రాహుల్ పేర్కొన్నారు. వారాణసీలో మోదీ త్రుటిలో ఓటమిని తప్పించుకున్నారని ఆయన పేర్కొన్నారు.
‘‘ఏడో విడత ఎన్నికల ప్రచార విరామంలో అందరూ ఇంటికి పరిమితం అయ్యారు. కానీ, మోదీ ధ్యానం పేరిట కన్యాకుమారిలో ప్రచారం సాగించారు. ఇంత చేసినా గానీ వారాణసీలో మోదీ మెజారిటీ గణనీయంగా తగ్గిపోయింది’’ అని రాహుల్ ఎద్దేవా చేశారు.