Rahul Gandhi: ఇంకెంతకాలం కళ్లు మూసుకుని ఉంటారు? బీజేపీపై రాహుల్ మండిపాటు
ABN , Publish Date - Sep 12 , 2024 | 03:33 PM
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నా ఆ పార్టీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని లోక్ సభపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) విమర్శించారు.
ఢిల్లీ: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నా ఆ పార్టీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని లోక్ సభపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో ట్రైనీ ఆర్మీ మహిళపై జరిగిన అత్యాచార ఘటనను ఉద్దేశిస్తూ ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.
"ట్రైనీ ఆర్మీ అధికారులపై దాడి, వారి స్నేహితురాలిపై అత్యాచారం సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో శాంతిభద్రలు కరవయ్యాయి. మహిళలపై రోజురోజుకు పెరుగుతోన్న నేరాలపట్ల బీజేపీ ప్రదర్శిస్తోన్న ప్రతికూల వైఖరి ఆందోళన కలిగిస్తోంది. అధికార యంత్రాంగం వైఫల్యం వల్లే నేరస్థులు ఇలాంటి పనులకు పూనుకుంటున్నారు. ఈ నేరాలు అమ్మాయిల స్వేచ్ఛ, ఆకాంక్షలకు అడ్డంకిగా మారతాయి. దేశ జనాభాలో సగ భాగమైన ఆడపిల్లలపై ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. ఇంకా ఎంతకాలం కళ్లుమూసుకొని ఉంటారు" అని రాహుల్ ప్రశ్నించారు.
ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్మీ అధికారులు మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణ పొందుతున్నారు. అధికారులు ఇద్దరూ మధ్యాహ్న సమయంలో మహిళా స్నేహితులతో కలిసి ఛోటీ జామ్‌లోని ఫైరింగ్ రేంజ్‌కు వెళ్లారు. అయితే వారిని అకస్మాత్తుగా 8 మంది వ్యక్తులు పిస్టల్స్, కత్తులు, కర్రలతో చుట్టుముట్టారు. డబ్బు, నగలు, వస్తువులు దోచుకోవడానికి వచ్చిన దుండగులు ఇద్దరు ట్రైనీ అధికారులను దారుణంగా కొట్టారు.
ఒక ఆఫీసర్‌ని, ఒక మహిళను బందీలుగా మార్చుకున్న దుండగులు.. మరో అధికారిని, ఒక మహిళను వదిలిపెట్టి రూ.10 లక్షలు తీసుకొచ్చి బందీలుగా ఉన్నవారిని విడిపించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో వారి చెర నుంచి బయటపడ్డ ఆర్మీ అధికారి వేగంగా తన ఆర్మీ యూనిట్ వద్దకు వెళ్లి విషయాన్ని కమాండింగ్ అధికారికి చెప్పారు.
ఇదే సమయంలో డయల్-100 ద్వారా పోలీసులకు కూడా సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన పోలీసులు, సైనిక అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. అయితే వాహనాలను ముందుగానే గమనించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితులు నలుగురినీ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు ఆర్మీ అధికారులకు గాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు. ఒక మహిళపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయినట్టు బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్ చెప్పారు.
For Latest News and National News click here