Share News

Delhi: అమేఠీలో రాహుల్‌ రాయ్‌ బరేలీలో ప్రియాంక!

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:42 AM

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది.

Delhi: అమేఠీలో రాహుల్‌ రాయ్‌ బరేలీలో ప్రియాంక!

  • లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి నిర్ణయం!

  • నాలుగైదు రోజుల్లో ప్రకటించే చాన్స్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): అందులో భాగంగా అమేఠీ, రాయ్‌ బరేలీ లోక్‌సభ స్థానాల్లో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ బరిలో నిలవాలని నిర్ణయించుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై ఇప్పటికే కాంగ్రెస్‌ కీలక నేతల మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. బీజేపీ తనకు అత్యంత బలమైన రాష్ట్రంగా భావిస్తున్న ఉత్తరప్రదేశ్‌లో గాంధీ కుటుంబం నుంచి ఇద్దరు బరిలో నిలవడం ద్వారా కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయమై సోనియాగాంధీ సైతం సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. నాలుగైదు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


బాల రాముడి దర్శనం తర్వాత నామినేషన్‌!

బీజేపీ దేశవ్యాప్తంగా అయోధ్య రాముడి పేరును ప్రచారంలో కీలక అస్త్రంగా మలుచుకుంటోంది. అయితే, ఇప్పటివరకు రాహుల్‌, ప్రియాంక అయోధ్య రాముడిని దర్శించుకోలేదు. అందుకే అమేఠీ, రాయ్‌ బరేలీ స్థానాల్లో నామినేషన్‌ వేయడానికి ముందే అయోధ్య బాలరాముడిని ఇద్దరూ దర్శించుకోనున్నట్టు తెలిసింది. మే 20న అమేఠీ, రాయ్‌ బరేలీ స్థానాల్లో పోలింగ్‌ జరగనుంది.

కాగా, అమేఠీ, రాయ్‌ బరేలీ లోక్‌సభ నియోజకవర్గాలు కాంగ్రె స్‌కు కంచుకోటలుగా ఉన్నాయి. అమేఠీలో ఇప్పటి వరకు మూడుసార్లు మాత్రమే కాంగ్రెస్‌ ఓటమి పాలైంది. రాహుల్‌ గాంధీ 2004 నుంచి వరుసగా మూడుసార్లు అమేఠీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పుడు అమేఠీతో పాటు వయనాడ్‌ నుంచి రాహుల్‌ పోటీ చేశారు. అక్కడ విజయం సాధించారు.


రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఎన్నికలు: రాహుల్‌

ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. దీని కోసం కాంగ్రె్‌సకు మద్దతు ఇవ్వాలని ఓ వీడియో సందేశంలో ప్రజలను అభ్యర్థించారు. ‘ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని ప్ర యత్నిస్తున్న బీజేపీ-ఆరెస్సెస్‌, మరోవైపు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుతున్న కాంగ్రెస్‌, ఇండియా కూటమి ఉన్నాయ’ని పేర్కొన్నారు. దేశప్రజల సమస్యలు విని విప్లవాత్మకమైన మేనిఫెస్టో రూపొందించామని చెప్పారు.

Updated Date - Apr 26 , 2024 | 04:42 AM