IRCTC: రైల్వే టికెట్ల బుకింగ్‌పై IRCTC కీలక ప్రకటన.. ఆ వార్తలపై క్లారిటీ
ABN , Publish Date - Jun 25 , 2024 | 08:40 PM
కొన్ని రోజుల నుంచి రైల్వే టికెట్ల బుకింగ్‌పై ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. IRCTCలో తమ వ్యక్తిగత ఖాతాల ద్వారా రక్త సంబంధీకుల్ని మినహాయించి.. స్నేహితులు, ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే..
కొన్ని రోజుల నుంచి రైల్వే టికెట్ల బుకింగ్‌పై (Train Tickets Booking) ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. IRCTCలో తమ వ్యక్తిగత ఖాతాల ద్వారా రక్త సంబంధీకుల్ని మినహాయించి.. స్నేహితులు, ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడుతుందన్నదే ఆ వార్త సారాంశం. రైల్వే శాఖ కొత్తగా ఈ నిబంధనలను తీసుకొచ్చిందని, కాబట్టి బుకింగ్స్ విషయంలో జాగ్రత్త పాటించాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని రైల్వే శాఖ (Railway Ministry) తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని తెలిపింది.
తమ వ్యక్తిగత ఐడీ ద్వారా తమ కుటుంబ సభ్యులకే కాకుండా బంధువులు, స్నేహితులు, ఇంకా ఎవరికైనా ఈ-టికెట్లు బుక్ చేసుకోవచ్చని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అంతేకాదు.. ఒక IRCTC ఖాతా నుంచి నెలకు 12 టికెట్లు బుక్ చేసుకోవచ్చని, ఒకవేళ ఆధార్‌తో అనుసంధానం చేసినట్లైతే నెలలో 24 టికెట్ల వరకు బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉందని పేర్కొంది. ఇదే సమయంలో రైల్వే శాఖ ఓ హెచ్చరికనూ జారీ చేశారు. వ్యక్తిగత ఐడీలతో బుక్ చేసిన ఈ-టికెట్లతో వ్యాపారం చేయకూడదని.. అలా చేస్తే మాత్రం రైల్వే చట్టం-1989లోని సెక్షన్ 143 ప్రకారం నేరంగా పరిగణించడం జరుగుతుందని.. చట్టపరమైన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పింది.
ఎక్స్ వేదికగా రైల్వే శాఖ స్పందిస్తూ.. ‘‘ఓ ఐఆర్‌సీటీసీ ఖాతా ద్వారా కుటుంబ సభ్యులకే కాదు.. ఎవరికైనా టికెట్ బుక్ చేయొచ్చు. వేరే వాళ్లకు టికెట్లు బుక్ చేయడంపై ఆంక్షలు ఉన్నాయని చక్కర్లు కొడుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు. ఇంటి పేరుతో సంబంధం లేకుండా.. ఎవరికైనా ఈ-టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం కాదు. కానీ.. ఈ టికెట్లను వ్యాపారం చేయకూడదు. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు. అధికారిక గుర్తింపు పొందిన ఏజెంట్లకు మాత్రమే థర్డ్‌పార్టీ బుకింగ్ ద్వారా టికెట్లు బుక్ చేసి.. ఇతరులకు విక్రయించే అధికారం ఉంటుంది’’ అని పేర్కొంది.
Read Latest National News and Telugu News