Rajinikanth: ఆయన నా చిరకాల మిత్రుడే
ABN , Publish Date - Aug 26 , 2024 | 04:08 PM
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, డీఎంకే మంత్రి దురై మురుగన్ మధ్య ఇటీవల జరిగిన మాటల యుద్ధం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పాత స్టూడెంట్లు, కొత్త స్టూడెంట్లు అంటూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఈ దుమారానికి కారణమైంది. అంతా ఏం జరగనుందోనని అనుకుంటున్న తరుణంలో ఇందులో ఏమీ లేదంటూ ఇద్దరు ప్రముఖలు తేల్చేశారు.
చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajanikanth), డీఎంకే మంత్రి దురై మురుగన్ (Durai Murugan) మధ్య ఇటీవల జరిగిన మాటల యుద్ధం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పాత స్టూడెంట్లు, కొత్త స్టూడెంట్లు అంటూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఈ దుమారానికి కారణమైంది. అంతా ఏం జరగనుందోనని అనుకుంటున్న తరుణంలో ఇందులో ఏమీ లేదంటూ ఇద్దరు ప్రముఖలు తేల్చేశారు. మేము ''పాత మిత్రులమే''నని రజనీకాంత్ చెప్పగా, ''రజనీ మాటే నా మాట'' అంటూ దురై మురుగన్ స్పందించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
రజనీకాంత్ తన తాజా చిత్రం 'వెట్టైయన్' షూటింగ్ కోసం సోమవారంనాడు చెన్నై నుంచి విజయవాడ బయలుదేరారు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, మురుగున్‌తో తన సేహ్నం కొనసాగుతూనే ఉంటుందని, ఆయన ఏమి మాట్లాడినా అదేమంత పెద్ద విషయం కాదని చెప్పారు. దీనికి ముందు దురై మురుగన్ సైతం తమ మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ, రజనీ మాటే తన మాటని అన్నారు. తమ ఇద్దరి మధ్య జోక్‌లను ఎవరూ శత్రుత్వంగా భావించరని, ఇంతకుముందు ఎలాగ ఉన్నామో ఇప్పుడు కూడా తాము స్నేహితులుగానే ఉన్నామని చెప్పారు.
Shri Krishna Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అర్ధరాత్రి 12 గంటలకు అరుదైన దృశ్యం
ఎవరేమన్నారు? మాటల యుద్ధం ఏమిటి?
రజనీకాంత్ ఇటీవల మాటల సందర్భంలో... ''ఒక విషయం నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. కొత్త విద్యార్థులను హ్యాండిల్ చేయడం పెద్ద విషయం కాదు. అయితే పాత విద్యార్థులను (సీనియర్ నేతలు) హ్యాండిల్ చేయడం ఆషామాషీ కాదు. ఇక్కడ (డీఎంకే) చాలా మంది పాత విద్యార్థులు అన్నారు. వారేమీ సాధారణ విద్యార్థులు కాదు. వారంతా అసాధారణ పాత విద్యార్థులు. వీరంతా ర్యాంక్ హోల్డర్లు. క్లాస్‌ను విడిచిపెట్టేదే లేదని చెబుతుంటారు. ముఖ్యంగా ఇక్కడ (డీఎంకే) దురై మురుగన్ ఉన్నారు. మనం ఏమీ చెప్పలేము. అయితే, ఇంత సమర్ధవంతంగా అన్ని వ్యవహారాలను నడిపిస్తున్న స్టాలిన్‌కు మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి'' అని అన్నారు.
డీఎంకే సీనియర్ నేతలపై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై దురై మురుగున్ అంతే ఘాటుగా సమాధానమిచ్చారు. ''పళ్లు ఊడిపోయినా సరే నటన కొనసాగిస్తున్న పాత నటుల వల్లే కొత్త నటులు అవకాశాలు కోల్పోతున్నారు'' అంటూ కౌంటర్ ఇచ్చారు. కాగా, ఈ అంశం ముదరకుండా డీఎంకే యువజన, క్రీడాభివృద్ధి మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల సందర్భోచితంగా వ్యవహరించారు. యువకులంతా తమ వైపు (డీఎంకే) వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారనీ, వారికి చోటు కల్పించి, మార్గదర్శకం చేయడమే మన (డీఎంకే) పని అని చెప్పారు. రజనీకాంత్ ప్రసంగానికి చాలా ప్రశంసలు వచ్చాయని, ఆ ప్రసంగాన్ని మీరు కూడా వినాలంటూ పార్టీ యువజన విభాగం కార్యకర్తల్లో జోష్ నింపారు.
Read More National News and Latest Telugu News