Congress: కాంగ్రెస్ పార్టీలోకి వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా!
ABN , Publish Date - Sep 06 , 2024 | 02:56 PM
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం జరగబోతోంది. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఇవాళ (శుక్రవారం) హస్తం పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలు ఉన్నాయి.
న్యూ ఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం జరగబోతోంది. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఇవాళ (శుక్రవారం) హస్తం పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలు ఉన్నాయి. ఇదివరకే సెప్టెంబర్ 4న రాహుల్ గాంధీని ఈ రెజ్లర్లు ఇద్దరూ ఢిల్లీలో కలిశారు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ చాలా కాలం ప్రచారం జరుగుతోంది.
హర్యానా ఎన్నికల నేపథ్యంలో అక్కడి పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ వీరిద్దరినీ పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించింది. తద్వారా రాష్ట్రంలోని జాట్ సామాజిక వర్గం ఓట్లను తమ వైపు తిప్పుకొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ ఇద్దరు రెజ్లర్లు పార్టీలో చేరితో ఆ సామాజిక వర్గంలో ఆదరణ పెరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ వార్తల నేపథ్యంలో రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఇండియన్ రైల్వేస్‌లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. జీవితంలో కీలకమైన ఈ దశలో రైల్వే ఉద్యోగాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నానని, తన రాజీనామాను సంబంధిత రైల్వే అధికారులకు అందజేశానని, దేశానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించిన రైల్వే శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు.