ALET Maheshwar Reddy: చంద్రబాబును చూసి రేవంత్‌రెడ్డి నేర్చుకోవాలి
ABN , Publish Date - Jun 15 , 2024 | 06:12 AM
ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే ఐదు హామీలపై చంద్రబాబు సంతకం చేశారని, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ఆయన్ను చూసి నేర్చుకోవాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హితవు పలికారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలవుతున్నా హామీల ఊసే లేదని మండిపడ్డారు.
తెలంగాణలో ఆరు నెలలైనా హామీల ఊసే లేదు:ఏలేటి
న్యూఢిల్లీ, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే ఐదు హామీలపై చంద్రబాబు సంతకం చేశారని, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ఆయన్ను చూసి నేర్చుకోవాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హితవు పలికారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలవుతున్నా హామీల ఊసే లేదని మండిపడ్డారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజే వృద్ధాప్య పింఛన్‌ను రూ.3వేల నుంచి రూ.4 వేలకు పెంచారని గుర్తు చేశారు. తెలంగాణలోనూ వృద్ధాప్య పింఛన్‌ను రూ.4వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఇప్పటికీ దాన్ని అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో ఉన్నా చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలపై మాజీ సీఎం కేసీఆర్ ఫొటో ఉందన్న కారణంతో మళ్లీ వెనక్కి తీసుకున్నారని, దీనివల్ల ఖజానాపై భారం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ మాజీ ముఖ్యమంత్రి ఫొటోతో ఉన్న పుస్తకాలనే పిల్లలకు ఇచ్చారని గుర్తు చేశారు.