Share News

Mohan Bhagwat: చారిత్రక వాస్తవాలను వెలికి తీయాల్సిందే

ABN , Publish Date - Dec 27 , 2024 | 04:56 AM

మసీదు-ఆలయాల వివాదాలకు సంబంధించి ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ సంస్థ అనుబంధ పత్రిక ‘ది ఆర్గనైజర్‌’ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Mohan Bhagwat: చారిత్రక వాస్తవాలను వెలికి తీయాల్సిందే

  • ఆర్‌ఎ్‌సఎస్‌ పత్రిక ది ఆర్గనైజర్‌ సంపాదకీయం

న్యూఢిల్లీ, డిసెంబరు 26: మసీదు-ఆలయాల వివాదాలకు సంబంధించి ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ సంస్థ అనుబంధ పత్రిక ‘ది ఆర్గనైజర్‌’ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సోమ్‌నాథ్‌ నుంచి సంభాల్‌ వరకు, ఇంకా మరెన్నో అంశాలపై చారిత్రక వాస్తవాలను తెలుసుకునేందుకు పోరాటం చేస్తున్నామని, నాగరిక న్యాయం కోరుతున్నామని పేర్కొంది. మసీదు-ఆలయాల రగడ వద్దని, సామరస్యాన్ని కాపాడుకోవడానికి కొత్త వివాదాలకు దూరంగా ఉండాలని భాగవత్‌ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే.. ‘నాగరిక న్యాయం కోసం వివాదాస్పదమైన స్థలాలు, కట్టడాల వెనుక వాస్తవ చరిత్ర తెలుసుకోవడం చాలా ముఖ్యం. అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైంది.


అంబేడ్కర్‌ కుల ఆధారిత వివక్షకు సంబంధించిన మూలకారణాలను అన్వేషించి, దానిని అంతం చేయడానికి పరిష్కారాలు అందించారు. అలాగే, మతపరమైన అసమానతలకు ముగింపు పలకడానికి మూలాలను గుర్తించాలి’ అని పేర్కొంది. యూపీలోని చారిత్రక నగరం సంభాల్‌లో ప్రస్తుతమున్న జామా మసీదు స్థానంలో శ్రీహరిహర మందిరం ఉండేదని, దీన్ని సర్వే చేయాలని పిటిషన్‌ వేయడంతో వివాదం మొదలైందని వెల్లడించింది. అన్నివర్గాల ప్రజలను భాగస్వామ్యం చేసి వాస్తవిక చరిత్ర ఆధారంగా వివేకవంతమైన సమగ్ర చర్చ జరగాలని ఎడిటర్‌ ప్రఫుల్ల ఖేత్కర్‌ రాసిన సంపాదకీయంలో కోరారు.

Updated Date - Dec 27 , 2024 | 04:56 AM