S Jaishankar: అమెరికా వార్నింగ్‌పై భారత్ రియాక్షన్.. చిన్నచూపు చూడొద్దు
ABN , Publish Date - May 15 , 2024 | 10:31 AM
చాబహార్ పోర్టు నిర్వహణ కోసం ఇరాన్‌తో భారత్ కుదుర్చుకున్న పదేళ్ల ఒప్పందంపై అమెరికా పరోక్షంగా ఇచ్చిన వార్నింగ్ మీద విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు.
చాబహార్ పోర్టు (Chabahar Port) నిర్వహణ కోసం ఇరాన్‌తో (Iran) భారత్ కుదుర్చుకున్న పదేళ్ల ఒప్పందంపై అమెరికా (America) పరోక్షంగా ఇచ్చిన వార్నింగ్ మీద విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) స్పందించారు. ఈ ప్రాజెక్ట్‌ని చిన్నచూపు చూడొద్దని, ఇది ఎన్నో ప్రయోజనాలను చేకూరిస్తుందని తెలిపారు. గతంలో చాబహార్ ఔచిత్యాన్ని స్వయంగా యూఎస్ ప్రశంసించిందన్న విషయాన్ని కూడా ఆయన ఎత్తిచూపారు. బుధవారం కోల్‌కతాలో తాను రాసిన పుస్తకం ‘వై భారత్ మ్యాటర్స్’ (Why Bharat Matters) బంగ్లా ఎడిషన్‌ను ఆవిష్కరించిన తర్వాత జరిగిన ఇంటరాక్షన్‌లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘అమెరికా చేసిన వ్యాఖ్యల గురించి నేను విన్నాను. కానీ.. ఈ చాబహార్ పోర్టు ఒప్పందం అనేది ప్రతిఒక్కరి ప్రయోజనం కోసం. ఈ విషయం అర్థమయ్యేలా ప్రజలకు చెప్పాలి, ఒప్పించగలగాలని నేను భావిస్తాను. ఈ ప్రాజెక్ట్‌ని ఏ ఒక్కరూ చిన్నచూపు చూడకూడదు. గతంలో అమెరికా కూడా అలా చేయలేదు. ఈ చాబహార్ పోర్టు పట్ల అమెరికా వైఖరిని పరిశీలిస్తే.. దాని గొప్పదనాన్ని, విశాల ఉపయోగాలను ఆ అగ్రరాజ్యం మెచ్చుకుంది’’ అని జైశంకర్ చెప్పుకొచ్చారు. అలాగే.. అమెరికా చేసిన వ్యాఖ్యలపై తాము చర్చిస్తామని కూడా తెలిపారు. ఈ ఒప్పందం భారత్‌తో పాటు మధ్య ఆసియా దేశాలకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో కలిశారు.. చెల్లెమ్మా అంటూ దగ్గరయ్యారు.. చివరికి?
అమెరికా జారీ చేసిన హెచ్చరికలేంటి?
చాబహార్ పోర్టు నిర్వహణ కోసం ఇరాన్, భారత్ మధ్య ఒప్పందం కుదిరిన కొన్ని గంటల వ్యవధిలోనే అమెరికా స్పందిస్తూ.. ఇరాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు, దేశ విదేశాంగ విధాన లక్ష్యాలపై భారత్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చని తెలిపింది. కానీ.. ఇరాన్‌పై అమెరికా కొన్ని ఆంక్షలు విధించిందని, వాటి అమలుని తాము కొనసాగిస్తూనే ఉంటామని పేర్కొంది. అలాంటి ఇరాన్‌తో ఏ సంస్థ అయినా, ఏ దేశమైనా వ్యాపార లావాదేవీలు జరిపితే.. వారు కూడా ఆ ఆంక్షల ఛట్రంలో పడే ప్రమాదం ఉందని భారత్‌ను పరోక్షంగా హెచ్చరించింది. ఈ వార్నింగ్ గతంలోనూ చాలాసార్లు ఇచ్చామని పేర్కొంది. ఇందుకు బదులుగానే జైశంకర్ పైవిధంగా స్పందించారు.
26 ఏళ్ల క్రితం తప్పిపోయాడు.. తీరా చూస్తే 200 మీటర్ల దూరంలోనే..
అసలు చాబహార్ ఒప్పందం ఏంటి?
మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్య వ్యవహారాలు నెరపేందుకు ‘చాబహార్ పోర్టు’ ప్రధాన మార్గంగా ఉంది. ఈ మార్గం ద్వారా కజకిస్థాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్థాన్, తుర్కెమెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలకు భారత్ నుంచి సరకు రవాణా చేయవచ్చు. అందుకే.. చాబహార్ నిర్వహణ కోసం ఇరాన్‌తో భారత్ పదేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పోర్టు అభివృద్ధి, నిర్వహణలో ఇప్పుడు భారత్ కీలకపాత్ర పోషిస్తుంది. కేవలం పదేళ్లే కాకుండా దీర్ఘకాలిక ఒప్పందం దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని, ఎందుకంటే అది లేకుండా పోర్ట్ ఆపరేషన్‌ని మెరుగుపర్చలేమని కూడా జై శంకర్ చెప్పుకొచ్చారు.
Read Latest National News and Telugu News