Share News

Kejriwal Arrest: కేజ్రీవాల్ భద్రత గురించి మేము ఆందోళన చెందుతున్నాం

ABN , Publish Date - Mar 22 , 2024 | 10:37 AM

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత తాజాగా ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ కుటుంబంలోని ఎవరినీ తనను కలవడానికి అనుమతించడం లేదని సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. దీంతోపాటు మరికొంత మంది ఆప్ నేతలు కూడా స్పందించారు.

Kejriwal Arrest: కేజ్రీవాల్ భద్రత గురించి మేము ఆందోళన చెందుతున్నాం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌(Kejriwal arrest)ను ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత తాజాగా ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్(saurabh bhardwaj) మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిని తప్పుడు కేసులో శిక్షించారని, వృద్ధులైన తల్లిదండ్రులు, పిల్లలపై కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అంటూ ప్రశ్నించారు. అతని కుటుంబాన్ని కలవడానికి ఎవరినీ అనుమతించడం లేదన్నారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌పై చూపిన ప్రేమకు రాహుల్ గాంధీ(rahul gandhi), ప్రియాంక గాంధీ, ఎంకే స్టాలిన్, అఖిలేష్ యాదవ్ సహా ప్రతిపక్ష నేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. మా రాజకీయ పార్టీని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మా పార్టీ కార్యాలయాన్ని కంటోన్మెంట్‌గా మార్చారని, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లో ఉందా, అసలు ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు.


ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఢిల్లీ అసెంబ్లీ(delhi assembly) నేటి కార్యకలాపాలు మార్చి 27కు వాయిదా పడ్డాయి. లిక్కర్ స్కాంలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఢిల్లీ పోలీసులు భద్రతను పెంచారు. భద్రత కోసం ఆర్‌ఏఎఫ్‌ను మోహరించారు.

ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి(atishi) ట్వీట్ చేస్తూ 'దేశంలో తొలిసారిగా సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్టు చేశారని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కి Z+ భద్రత ఉంది. ఇప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వ ఈడీ కస్టడీలో ఉన్నారు. మేము వారి భద్రత గురించి ఆందోళన చెందుతున్నామని వెల్లడించారు. దీనికి ముందు మంత్రి అతిశీ విలేకరుల సమావేశంలో బీజేపీపై విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ అరెస్టును బీజేపీ కుట్రగా అభివర్ణించారు. ఈడీ ఇప్పటి వరకు ఆధారాలు సమర్పించలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కేజ్రీవాల్ చేస్తున్న పోరాటం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మేం పోరాడుతున్నామని తెలిపారు. ఈ క్రమంలో మేం ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు.


ఈ క్రమంలోనే ఆప్ నేత రాఘవ్ చద్దా(raghav chadha) కూడా స్పందించారు. ఢిల్లీలోని లక్షలాది మంది పిల్లలకు ప్రపంచ స్థాయి విద్యను అందించిన వ్యక్తి, లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్, ప్రతి ఇంటికి నీరు ఇచ్చాడు. తల్లులు, సోదరీమణులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ అనేది ఒక వ్యక్తి పేరు కాదు, ఒక ఆలోచన, భావజాలం పేరు. మీరు అతని శరీరాన్ని అరెస్టు చేయవచ్చు, కానీ అతని ఆలోచనలను కాదని అన్నారు. ఒక్క కేజ్రీవాల్‌ని అరెస్ట్‌ చేస్తే లక్షల మంది కేజ్రీవాల్‌లు లేచి నిలబడతారని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.


ఈ క్రమంలోనే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(bhagwant mann) సోషల్ మీడియాలో 'మీరు అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారు, కానీ మీరు అతని ఆలోచనను ఎలా అరెస్టు చేస్తారని పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఒక వ్యక్తి కాదు, ఒక ఆలోచన, మేము మా నాయకుడితో అండగా ఉంటామని వెల్లడించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Delhi CM: కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారా, కొత్త సీఎం వస్తారా?

Updated Date - Mar 22 , 2024 | 12:55 PM