Kolkata doctor Case: రంగంలోకి ఆ సీబీఐ అధికారి.. న్యాయంపై అభయ తల్లిదండ్రుల విశ్వాసం..!
ABN , Publish Date - Aug 20 , 2024 | 03:37 PM
కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అభయ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలంటూ దేశం మొత్తం ఏకమైంది.
కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అభయ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలంటూ దేశం మొత్తం ఏకమైంది. ఈకేసు విచారణను కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించడంతో.. అందరి దృష్టి సీబీఐపైనే పడింది. సీబీఐ విచారణతో తమకు న్యాయం జరుగుతుందని బాధితురాలి తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. మొత్తం 30 మంది సభ్యుల బృందంలో సీబీఐ, సీఎఫ్‌ఎస్‌ఎల్ నిపుణులు ఉన్నారు. సాంకేతికతను ఉపయోగించి సాక్ష్యాలు, ఆధారాలను సేకరించేందుకు పలు రంగాలకు చెందిన నిపుణులు ఈ బృందంలో ఉన్నారు. ముఖ్యంగా 30 మంది సభ్యుల బృందానికి జార్ఖండ్ క్యాడర్‌కు చెందిన 1994 బ్యాచ్ IPS అధికారి సంపత్ నెహ్రా నాయకత్వం వహిస్తున్నారు. అయినా ఈ బృందంలో ఓ అధికారి మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. గతంలో ఆమె ట్రాక్ రికార్డు కారణంగా ప్రస్తుతం ఈకేసు దర్యాప్తు బృందంలో ఉండటంతో దేశ వ్యాప్తంగా ఈపేరుపై చర్చ జరుగుతోంది. ఆమె మరెవరో కాదు సీబీఐ ఏఎస్పీ సీమా పహుజా.
ఎవరీ సీమా పహుజా..?
1993లో ఢిల్లీ పోలీస్ శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా రిక్రూట్ అయిన సీమా పహుజా, ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. సీబీఐలోని అవినీతి నిరోధక శాఖ, స్పెషల్ క్రైమ్ యూనిట్‌లో చాలా సంవత్సరాలు పనిచేసిన తర్వాత అక్టోబర్ 1998లో ఆమె ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందారు. 2013లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. ఈ సమయంలో సీమా పహుజా మానవ అక్రమ రవాణా, మతమార్పిడి, హత్యలు, మైనర్ బాలికలపై నేరాలకు సంబంధించిన అనేక కేసులను పరిశోధించి నిందితులకు శిక్ష విధించేలా దర్యాప్తును విజయంవంతంగా చేపట్టారు. సిమ్లాలోని కోథాయ్‌లో జరిగిన గుడియా అత్యాచారం, హత్య కేసును ఛేదించిన తీరుకు సీమా పహుజా చాలా ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో హత్యాచార కేసుల దర్యాప్తు బృందంలో ఆమె సభ్యురాలిగా ఉన్నారు.
రెండు బంగారు పతకాలు..
సీమా పహూజా తన పనితీరు కారణంగా ఎన్నో ప్రశంసలతో పాటు అవార్డులు అందుకున్నారు. హరిద్వార్‌లో జరిగిన జంట హత్యల కేసును ఛేదించినందుకు సీమా పహుజా 2007లో బెస్ట్ ఇన్వెస్టిగేషన్ కింద మొదటి గోల్డ్ మెడల్ అందుకున్నారు. 2014 ఆగస్టు 15న ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు. 2018లో సీమా పహుజా కేంద్ర హోం మంత్రి ఎక్సలెన్స్ ఇన్వెస్టిగేషన్ అవార్డును అందుకున్నారు. సిమ్లాకు చెందిన గుడియా హత్యాచారం కేసును ఛేదించినందుకు 2018లోనే ఉత్తమ పరిశోధనకు గానూ రూ. 50,000 నగదు పురస్కారంతో పాటు బంగారు పతకాన్ని అందుకున్నారు. ఈ కేసు దర్యాప్తును సిబిఐ అత్యుత్తమ దర్యాప్తుగా కూడా పరిగణిస్తారు. సీమా పహుజా ప్రస్తుతం జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం కేసు దర్యాప్తును చేపడుతున్నారు. ఆమె సర్వీసు రికార్డును పరిశీలిస్తే ఈ కేసులో న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందని అభయ తల్లిదండ్రులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News