దళితులపై దాడి కేసులో..
ABN , Publish Date - Oct 26 , 2024 | 02:50 AM
కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతి తాలూకా మరగుబ్బి గ్రామంలో దళితులపై దాడికి పాల్పడిన కేసులో దోషులకు సెషన్స్ కోర్టు శిక్షలను ఖరారు చేసింది.
98 మందికి యావజ్జీవం, ముగ్గురికి ఐదేళ్ల జైలు
శిక్షలు ఖరారు చేసిన కొప్పళ జిల్లా సెషన్స్ కోర్టు
బళ్లారి గాంధీనగర్, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతి తాలూకా మరగుబ్బి గ్రామంలో దళితులపై దాడికి పాల్పడిన కేసులో దోషులకు సెషన్స్ కోర్టు శిక్షలను ఖరారు చేసింది. పదేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై ఈ నెల 22న కొప్పళ జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. ముద్దాయిలలో 101 మందిని దోషులుగా ప్రకటించింది. వీరికి గురువారం సాయంత్రం శిక్ష ఖరారు చేసింది. 98 మందికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.5 వేలు చొప్పున జరిమానా విధించింది. ముగ్గురికి అట్రాసిటీ కేసు వర్తించని కారణంగా ఐదేళ్ల జైలు, రూ.2వేల జరిమానా విధించింది. మరో ముద్దాయి రామణ్ణ లక్ష్మణ భోవి కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్నారు. ఆయన్ను పోలీసులు అలాగే కోర్టుకు తీసుకొచ్చారు. తీర్పు వెలువడిన అనంతరం కోర్టు ఆదేశాలతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రామణ్ణ మృతి చెందారని పోలీసులు తెలిపారు.