Sandeshkhali case: సిబీఐకి షేక్ షాజహాన్ అప్పగింత.. రెండ్రోజుల ప్రతిష్ఠంభనకు తెర
ABN , Publish Date - Mar 06 , 2024 | 08:32 PM
సందేశ్‌ఖాలీ కేసులో భూఆక్రమణలు, లైంగిక దాడులు, ఈడీ అధికారులపై దాడుల ఆరోపణలను ఎదుర్కొంటున్న టీఎంసీ సస్పెండెడ్ నేత షేక్ షాజహాన్‌ను ఎట్టకేలకు బెంగాల్ పోలీసులు సీబీఐకి బుధవారం సాయంత్రం అప్పగించారు. దీంతో బెంగాల్ ప్రభుత్వానికి, సీబీఐకి మధ్య రెండ్రోజులుగా తలెత్తిన ప్రతిష్టంభనకు తెరపడింది.
కోల్‌కతా: సందేశ్‌ఖాలీ (Sandeshkhali) కేసులో భూఆక్రమణలు, లైంగిక దాడులు, ఈడీ అధికారులపై దాడుల ఆరోపణలను ఎదుర్కొంటున్న టీఎంసీ సస్పెండెడ్ నేత షేక్ షాజహాన్ (Sheikh Shahjahan)ను ఎట్టకేలకు బెంగాల్ పోలీసులు సీబీఐ (CBI)కి బుధవారం సాయంత్రం అప్పగించారు. దీంతో బెంగాల్ ప్రభుత్వానికి, సీబీఐకి మధ్య రెండ్రోజులుగా తలెత్తిన ప్రతిష్టంభనకు తెరపడింది. సాయంత్రం 4.30 గంటల్లోగా సీబీఐకి షాజహాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించాలంటూ కోల్‌కతా హైకోర్టు బెంగాల్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడంతో తాజా పరిణామం చోటుచేసుకుంది.
కేసు పరిణామ క్రమం...
ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోల్‌కతా హైకోర్టు మంగళవారంనాడు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై వెంటనే పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే దీనిపై తక్షణమే విచారణ చేపట్టలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో కేసు బాధ్యతలు చేపట్టిన సీబీఐ మంగళవారం సాయంత్రమే కేసు నమోదు చేసింది. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు పశ్చిమబెంగాల్ సీఐడీ కార్యాలయానికి అధికారులు వెళ్లారు. అయితే, షేక్ షాజహాన్‌ను అప్పగించేందుకు సీఐడీ నిరాకరించింది. దీంతో హైకోర్టును తిరిగి సీబీఐ ఆశ్రయించింది. దీంతో హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. బెంగాల్ సీఐడీకి కోర్టు ధిక్కారణ నోటీసులు పంపింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇదే సమయంలో బుధవారం సాయంత్రం 4.30 కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ షాజహాన్‌ను సీబీఐకి అప్పగించాలంటూ బెంగాల్ సర్కార్‌కు ఆదేశాలిచ్చింది. దీంతో షాజహాన్ అప్పగింతకు మార్గం సుగమమైంది. దీనికి ముందు, ఫిబ్రవరి 29న నిందితుడిని బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. కేసును సీఐడీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. అనంతరం ఈ కేసును సీఐడీ నుంచి సీబీఐకి అప్పగించాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశాలిచ్చింది.