Share News

Uttar Pradesh: తోడేళ్లు కనిపిస్తే కాల్చేయండి.. సీఎం ఆదేశాలు

ABN , Publish Date - Sep 03 , 2024 | 01:52 PM

ఉత్తరప్రదేశ్‌‌లోని బహరాయిచ్ జిల్లా ప్రజలను తోడేళ్లు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. చిన్నారులపై దాడి చేసి వారి ప్రాణాలను బలిగొంటున్నాయి. అటువంటి పరిస్థితుల్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Uttar Pradesh: తోడేళ్లు కనిపిస్తే కాల్చేయండి.. సీఎం ఆదేశాలు

లఖ్‌నవూ, సెప్టెంబర్ 03: ఉత్తరప్రదేశ్‌‌లోని బహరాయిచ్ జిల్లా ప్రజలను తోడేళ్లు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. చిన్నారులపై దాడి చేసి వారి ప్రాణాలను బలిగొంటున్నాయి. అటువంటి పరిస్థితుల్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తోడేళ్లు కనిపిస్తే కాల్చివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చిన్నారులపై తోడేళ్లు దాడి చేసి.. వారి ప్రాణాలు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ బేడియా’ పేరటి గతంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

wolves.jpg

అందులోభాగంగా నాలుగు తోడేళ్లను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. అయినా తోడేళ్లు దాడి మాత్రం ఆగకుండా కొనసాగుతుంది. దీంతో బహరాయిచ్ జిల్లాలో తోడేళ్ల దాడిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన ఉన్నతాస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ దాడుల ఘటనలకు సంబంధించిన తీవ్రతను దృష్టిలో పెట్టుకుని.. తోడేళ్లు కనిపిస్తే కాల్చివేయాలని సీఎం యోగి ఆదేశాలు జారీ చేశారు.


సోమవారం రాత్రి గిరిధర్‌పూర్ ప్రాంతంలో అయిదేళ్ల బాలికపై తోడేలు దాడి చేసింది. అంతలో కుటుంబ సభ్యులు స్పందించడంతో.. బాలికను వదిలి తోడేలు అక్కడి నుంచి పరారైంది. తోడేలును పట్టుకునేందుకు ప్రయత్నించారు. అది చిక్కకుండా పరారైంది. బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మరోవైపు హర్ది ప్రాంతంలో తల్లి పక్కనే నిద్రిస్తున్న బాలుడి పీకను తోడేలు నోట కరిచి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది.

uttarpradesh.jpg


ఇంతలో వింత శబ్దం వినిపించడంతో.. ఆ తల్లి మేల్కొని తోడేలు మెడను గట్టిగా పట్టుకుంది. అనంతరం ఆమె బిగ్గరగా కేకలు వేసింది. స్థానికులు వెంటనే స్పందించి.. అక్కడకి రావడంతో ఆ బాలుడిని వదిలి తోడేలు పరారైంది. ఆ బాలుడు సైతం ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బహరాయిచ్ జిల్లాలో వరుస తోడేళ్ల దాడుల కారణంగా 35 గ్రామాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.

up-attack.jpg


తోడేళ్ల దాడులపై జిల్లా కలెక్టర్ స్పందన..

ఈ ఏడాది జులై 17వ తేదీ నుంచి జిల్లాలో చిన్నారులపై తోడేళ్లు దాడి చేస్తున్నాయని బెహరాయిచ్ జిల్లా కలెక్టర్ మోనికా రాణి వెల్లడించారు. తోడేళ్ల దాడుల్లో ఇప్పటి వరకు 8 మంది మరణించారని తెలిపారు. వారిలో ఏడుగురు చిన్నారులే ఉన్నారన్నారు. ఈ తోడేళ్ల దాడిలో మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.

తోడేళ్లను పట్టుకునేందుకు పోలీసులు, అటవీ శాఖ అధికారులు, స్థానిక పంచాయతీ అధికారులు సంయుక్తంగా కలిసి పని చేస్తున్నారని పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో తోడేళ్ల ఆచూకీ కోసం ద్రోణుల సహయం తీసుకుంటున్నామని వెల్లడించారు. చిన్నారులపై దాడి చేస్తున్న తోడేళ్లను పట్టుకునేందుకు జిల్లా యంత్రాంగం పలు చర్యలు సైతం చేపట్టిందని వివరించారు.


అందులోభాగంగా టెడ్డి బొమ్మలను చిన్నారుల మూత్రంతో తడిపి అటవీ, నిర్మానుష్య ప్రాంతంలో ఉంచుతున్నామని చెప్పారు. ఈ టెడ్డి బొమ్మలను చిన్నారులగా భ్రమించి.. తోడేళ్ల వస్తే పట్టుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇంకోవైపు తోడేళ్ల గుంపు ప్రాంతాలను మారుస్తూ.. జిల్లాలో సంచరిస్తుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అందువల్లే తోడేళ్లను పట్టుకోవడంలో తీవ్ర ఆలస్యమవుతుందని చెప్పారు.

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 03 , 2024 | 02:28 PM