Share News

Sri Nagar: వేర్పాటువాదం నుంచి ప్రజాస్వామ్యం వైపు!

ABN , Publish Date - Sep 23 , 2024 | 03:22 AM

దశాబ్దాలపాటు తీవ్రవాదం, వేర్పాటువాదం, ఎన్నికల బహిష్కరణలు వంటి సమస్యలతో సతమతమైన జమ్ముకశ్మీర్‌లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది.

Sri Nagar: వేర్పాటువాదం నుంచి ప్రజాస్వామ్యం వైపు!

  • జమ్ముకశ్మీర్‌ ఎన్నికల బరిలో 25 మంది వేర్పాటువాదులు

  • గతంలో ఎన్నికలు బహిష్కరించిన వారే ఇప్పుడు బరిలోకి

శ్రీనగర్‌, సెప్టెంబరు 22: దశాబ్దాలపాటు తీవ్రవాదం, వేర్పాటువాదం, ఎన్నికల బహిష్కరణలు వంటి సమస్యలతో సతమతమైన జమ్ముకశ్మీర్‌లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. గతంలో ఎన్నికలు బహిష్కరించిన వారే ఇప్పుడు ప్రజాస్వామ్యం వైపు మొగ్గుచూపి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్య ప్రక్రియే మార్గమని తలంచి.. ప్రజలంతా ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 25 మందికిపైగా మాజీ మిలిటెంట్లు, వేర్పాటువాదులు, నిషేధిత జమాతే ఇస్లామీ సభ్యులు, వారి బంధువులు స్వతంత్ర అభ్యర్థులుగా, లేదా పార్టీ టికెట్లపై పోటీ చేస్తున్నారు.


వారిలో మాజీ వేర్పాటువాదులు జాఫర్‌ హబీబ్‌ దార్‌, సయ్యద్‌ సలీం గిలానీ, జావిద్‌ హుబ్బి, ఆగా ముంతాజిర్‌ మెహ్ది వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. జమ్ముకశ్మీర్‌ అప్నీ పార్టీ అభ్యర్థిగా జాఫర్‌ హబీబ్‌ దార్‌ బరిలోకి దిగుతున్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 370ను రద్దు చేసి.. దీన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించినప్పటి నుంచి జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు మారాయి. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని జాఫర్‌ భావిస్తున్నారు. ‘ఎన్నికల ప్రక్రియ ద్వారానే సమస్యలను పరిష్కరించగలం. ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలి’ అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.


జేకేఎల్‌ఎఫ్‌ మాజీ కమాండర్‌ ఫరూక్‌ అహ్మద్‌ దార్‌ కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. సైఫుల్లా ఫరూక్‌గా కూడా పేరుపొందిన దార్‌... హబ్బా కడల్‌ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. 1989లో ఆయుధాల శిక్షణ కోసం దార్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు వెళ్లారు. కానీ, ఇప్పుడు ఆ నిర్ణయంపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఆ సమయంలో అందరం తుపాకీ పట్టుకున్నాం. కశ్మీర్‌లో పాకిస్థాన్‌ ఏజెంట్లు మమ్మల్ని తప్పుదోవ పట్టించారు’’ అని దార్‌ పేర్కొన్నారు.


ఏడాదిపాటు తీవ్రవాద కార్యకలాపాలు నడిపిన దార్‌ ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయి.. దాదాపు ఐదేళ్లు జైలు జీవితం గడిపారు. 2019లో మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీచేశారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కశ్మీర్‌లో పాకిస్థాన్‌ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా, కుల్గాం, బందిపొరా, బారాముల్లా, సోపోర్‌ సహా సుమారు 15 నియోజకవర్గాల్లో జమాత్‌ వ్యూహాత్మకంగా స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దింపింది. వారిలో తలాత్‌ మజీద్‌, సయార్‌ అహ్మద్‌, హఫీజ్‌ మొహమ్మద్‌ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. కాగా.. మాజీ మిలిటెంట్లు, వేర్పాటువాదులు కలిసి తహ్రీక్‌-ఇ-అవామ్‌ అనే రాజకీయ గ్రూపుగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

Updated Date - Sep 23 , 2024 | 03:23 AM