Share News

Supreme Court: యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీం

ABN , Publish Date - Aug 05 , 2024 | 01:45 PM

ఢిల్లీ రాజేంద్ర నగర్‌ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల మరణాలపై కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Supreme Court: యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీం

ఢిల్లీ: ఢిల్లీ రాజేంద్ర నగర్‌ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల మరణాలపై కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సివిల్ సర్వీస్ విద్యార్థుల మృతితో కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీం పేర్కొంది. కోచింగ్ సెంటర్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎన్సీఆర్ భద్రత చర్యలపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. జూలై 27న రావుస్ కోచింగ్ సెంటర్ సెల్లార్ లైబ్రరీలో వరద నీరు చేరి ముగ్గురు యూపీఎస్సీ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.


రావూస్ కోచింగ్ సెంటర్ సెల్లార్‌లో మృతి చెందిన ముగ్గురిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రేయా యాదవ్ (25), తెలంగాణకు చెందిన తాన్యా సోని (25), కేరళకు చెందిన నెవిన్ డెల్విన్ (24) ఉన్నారు. ముఖ్యంగా కోచింగ్ సెంటర్‌లలో భద్రతా నిబంధనలకు సంబంధించిన సమస్యను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇటీవలి కాలంలో కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో వివిధ పరీక్షలకు హాజరయ్యే యువత ప్రాణాలను బలిగొన్న సంఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ నిర్దేశించిన భద్రతా నిబంధనల ఉల్లంఘనలకు కారణాన్ని చూపించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, ఎంసీడీని సుప్రీంకోర్టు కోరింది. భద్రతపై జవాబు చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.


ఈ మేరకు న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనను తీవ్రంగా ఖండించింది. కోచింగ్ సెంటర్ ప్రాంతాలన్నీ మృత్యు కుహరాలుగా మారాయని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. భద్రతా నిబంధనలతో పాటు గౌరవప్రదమైన జీవితానికి సంబంధించిన ప్రాథమిక నిబంధనలను పూర్తిగా పాటించకపోతే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఆన్‌లైన్‌‌కు మాత్రమే పరిమితమవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. కోచింగ్ సెంటర్లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యువత జీవితాలతో ఆడుకుంటున్నాయని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలోని ఏ ఇన్‌స్టిట్యూట్‌లు భద్రతా నిబంధనలకు లోబడి లేకపోతే మాత్రం వాటిని నిర్వహించేందుకు అనుమతించవద్దని స్పష్టం చేసింది.

Updated Date - Aug 05 , 2024 | 01:45 PM