Supreme Court: అలీగఢ్.. సెంట్రల్ యూనివర్సిటీ కాదు!
ABN , Publish Date - Nov 09 , 2024 | 05:25 AM
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి (ఏఎంయూ) మైనారిటీ హోదా లభించేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు, ఏఎంయూను మైనారిటీ సంస్థగా కాకుండా సెంట్రల్ యూనివర్సిటీగా గుర్తించాలంటూ 1967లో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం కొట్టివేసింది.
మైనారిటీ హోదా ఇచ్చే అంశంపై
కొత్త ధర్మాసనం విచారణ జరపాలి
విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకునే
హక్కు మత, భాషా మైనారిటీలకుంది
సుప్రీంకోర్టు 4:3 మెజారిటీ తీర్పు
న్యూఢిల్లీ, నవంబరు 8: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి (ఏఎంయూ) మైనారిటీ హోదా లభించేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు, ఏఎంయూను మైనారిటీ సంస్థగా కాకుండా సెంట్రల్ యూనివర్సిటీగా గుర్తించాలంటూ 1967లో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం కొట్టివేసింది. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తన పదవీకాలం చివరిరోజైన శుక్రవారం.. సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఏఎంయూ మైనారిటీ హోదాపై తీర్పును వెలువరించారు. అయితే, ఏఎంయూ మైనారిటీ వర్సిటీ కాదన్న గత తీర్పును కొట్టివేసినప్పటికీ.. మైనారిటీ హోదా అంశంపై విచారణకు కొత్త ధర్మాససానికి ఈ కేసును సిఫార్సు చేశారు. ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు 4:3 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. వాస్తవానికి ఈ కేసుపై విచారణ ఫిబ్రవరి 1వ తేదీనే ముగిసినప్పటికీ ధర్మాసనం తీర్పును రిజర్వులో పెట్టి ప్రస్తుతం వెలువరించింది.
ప్రత్యేక విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకునే హక్కు మతపరమైన, భాషాపరమైన మైనారిటీలకు ఉందని ఆర్టికల్ 30(1) విస్పష్టంగా ప్రకటిస్తున్న విషయాన్ని సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. రాజ్యాంగం అమలులోకి రాకముందు ఏర్పాటైన యూనివర్సిటీలకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. ఏఎంయూని మైనారిటీ వర్గం ఏర్పాటు చేయలేదని, ఒక ప్రత్యేక చట్టం ద్వారా అది ఏర్పాటైనందున దానిని మైనారిటీ విద్యాసంస్థగా గుర్తించలేమని పేర్కొన్న 1967 నాటి సుప్రీంకోర్టు తీర్పును.. ఈ కారణం వల్లనే కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రత్యేకంగా ఏఎంయూకు, మొత్తంగా మైనారిటీ హక్కులకు లభించిన విజయమని ఏఎంయూ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఫైజన్ ముస్తఫా హర్షం వ్యక్తం చేశారు. వర్సిటీ రిజిస్ట్రార్‌గా ఉన్న సమయంలో ఆయనే సుప్రీంకోర్టులో ఈ కేసు దాఖలు చేశారు. కాగా, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మైనారిటీలకు ఉన్న చదువుకునే హక్కును సమర్థిస్తోందని మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ పేర్కొన్నారు.