ఇకపై అన్ని బెంచ్‌ల విచారణలు ప్రత్యక్ష ప్రసారం
ABN , Publish Date - Oct 19 , 2024 | 04:00 AM
దేశ సర్వోన్నత న్యాయస్థానం చరిత్రలో మరో అధ్యాయం మొదలు కాబోతుంది. ఇప్పటి వరకు రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణను మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సుప్రీంకోర్టు ఇకపై అన్ని ...
న్యూఢిల్లీ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): దేశ సర్వోన్నత న్యాయస్థానం చరిత్రలో మరో అధ్యాయం మొదలు కాబోతుంది. ఇప్పటి వరకు రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణను మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సుప్రీంకోర్టు ఇకపై అన్ని ధర్మాసనాల ముందు నిత్యం జరిగే కేసుల విచారణలను సయితం ప్రత్యక్ష ప్రసారం(లైవ్ స్ట్రీమింగ్) చేయాలని భావిస్తోంది. శుక్రవారం ప్రయోగాత్మకంగా అన్ని ధర్మాసనాల ఎదుట జరిగిన విచారణలను లైవ్ స్ట్రీమ్ చేసి పరిశీలించింది. వీటిని అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో కాకుండా కోర్టు కోసం ప్రత్యేకంగా రూపొందించిన సొంత అప్లికేషన్ అయిన బీటా వెర్షన్ యాప్ ద్వారా ప్రసారం చేసింది.
లోటుపాట్లను సమీక్షించిన తరువాత పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురానుంది. రాజ్యాంగ ధర్మాసనం విచారించే కేసులు అదీ ప్రాముఖ్యం ఉన్న వాటినే ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా దాన్ని మరింతగా విస్తరించాలని ప్రతిపాదించింది. పారదర్శకత ఉండాలన్న ఉద్దేశంతో 2018లో ఇచ్చిన కీలక తీర్పులో సుప్రీంకోర్టు లైవ్ స్ట్రీమింగ్‌కు అనుమతి ఇచ్చింది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ పదవీ విరమణ చేసిన రోజున ఆయన నేతృత్వంలోని ధర్మాసనం నిర్వహించిన కార్యకలాపాలను దేశ ప్రజలంతా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.