Swami Prasad Maurya: అఖిలేష్‌కు షాక్.. పార్టీ పదవికి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా
ABN , Publish Date - Feb 13 , 2024 | 07:37 PM
లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య మంగళవారంనాడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాకు కారణాలను వివరిస్తూ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కు లేఖ రాశారు.
లక్నో: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ (SP) ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య (Swamy Prasad Maurya) మంగళవారంనాడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాకు కారణాలను వివరిస్తూ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav)కు లేఖ రాశారు. అయితే పార్టీ పదవికి రాజీనామా చేసినా పార్టీలోనే మౌర్య కొనసాగనున్నారు.
రాజీనామా లేఖలో ఏముంది?
కులగణన చేపట్టడం, రిజర్వేషన్ల పరిరక్షణ, నిరుద్యోగ సమస్య పరిష్కారం, రాజ్యాంగ పరిరక్షణ వంటి అంశాలతో 'రథయాత్ర' చేపట్టాలని అఖిలేష్ యాదవ్‌కు తాను ప్రతిపాదించినట్టు ఆ లేఖలో మౌర్య పేర్కొన్నారు. ఇలాంటి చర్యల ద్వారా సమాజ్‌వాదీ పార్టీకి మద్దతు పెరుగుతుందని సూచించారు. హోలి పండుగ తరువాత రథయాత్ర తీద్దామని అఖిలేష్ అంగీకరించినప్పటికీ ఇంతవరకూ తన ఆలోచన కార్యరూపంలోకి రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పటిష్టతకు అవిశ్రాంతగా తాను కృషి చేశానని, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయిలో తాను చేసిన ప్రకటనలను వ్యక్తిగత అభిప్రాయాలుగా పార్టీ కొట్టివేయడం సైతం తనను ఆశ్చర్యానికి గురించేసిందని మౌర్య తెలిపారు. పార్టీలో వివక్షకు గురవుతున్నాననే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్..
మౌర్య ఇటీవల కాలంలో పలు వివాదాస్పద ప్రకటనలో ప్రముఖంగా వార్తల్లోకి వచ్చారు. సనాతన ధర్మం, హిందుత్వ, అయోధ్యలో రామాలయ నిర్మాణం, రామచరిత మానస్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వివిధ వర్గాలతో పాటు సొంత పార్టీలోని పలువురి నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. మౌర్య ప్రకటన విషయంలో సమాజ్‌వాదీ పార్టీ పట్టీపట్టనట్టు వ్యవహరించడంతో పాటు, ప్రజల మనోభావాలకు చెందిన అంశాల విషయంలో సంయమనంతో వ్యవహరించాలని ఆయనకు సూచించింది. ఈ పరిణామాల క్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి మౌర్య రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.