Share News

Swami Prasad Maurya: సమాజ్‌వాదీ పార్టీకి మౌర్య రాజీనామా, సొంత పార్టీకి సన్నాహాలు

ABN , Publish Date - Feb 20 , 2024 | 04:21 PM

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ కి ఆ పార్టీ ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన మంగళవారంనాడు రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ సభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించారు.

Swami Prasad Maurya: సమాజ్‌వాదీ పార్టీకి మౌర్య రాజీనామా, సొంత పార్టీకి సన్నాహాలు

పాట్నా: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party)కి ఆ పార్టీ ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య (Swami Prasad Maurya) షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన మంగళవారంనాడు రాజీనామా (Resign) చేశారు. ఎమ్మెల్సీ సభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించారు. కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఎస్పీకి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.


కొత్త పార్టీపై 22న నిర్ణయం

స్వామి ప్రసాద్ మౌర్య తన మద్దతుదారులతో ఈనెల 22న ఢిల్లీలో సమావేశం కానున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశంలో తన తదుపరి కార్యాచరణను ఆయన ప్రకటించనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఇటీవల తన మద్దతుదారులతో మౌర్య సమావేశమై, కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై చర్చించారు. పార్టీకి 'రాష్ట్రీయ సోషిత్ సమాజ్ దళ్' అనే పేరును కూడా పరిశీలించారు. కొత్త పార్టీ ఆలోచనపై మౌర్యను మీడియా ప్రశ్నించినప్పుడు ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. భవిష్యత్ కార్యాచరణ కోసం 22న ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో సమావేశానికి తన మద్దతుదారులు పిలుపునిచ్చారని, అక్కడే అన్ని విషయాలు చర్చిస్తామని తెలిపారు. పార్టీ తనను పట్టించుకోవడం లేదంటూ మౌర్య ఈనెల 13న సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. వెనుకబడిన తరగతి వర్గాల్లో మంచి పేరున్న మౌర్య 2022లో బీజేపీని వీడి ఎస్పీలో చేరారు. ఐదుసార్లు ఆయన ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, సభానేతగా, విపక్ష నేతగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

Updated Date - Feb 20 , 2024 | 04:21 PM