Drug Racket: రూ.2 వేల కోట్ల డ్రగ్ రాకెట్ గుట్టురట్టు.. తమిళ నిర్మాతే మాస్టర్‌మైండ్?
ABN , Publish Date - Feb 25 , 2024 | 03:13 PM
మన భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ‘డ్రగ్ రాకెట్’ (Drug Racket) ఒకటి. దీనిని నిర్మూలించేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఇల్లీగల్‌గా ఈ దందా నడుస్తూనే ఉంది. ఈమధ్య కాలంలో ఇది మరింత విస్తరించడంతో.. అధికారులు ప్రత్యేక ఆపరేషన్స్ నిర్వహించి, డ్రాగ్ రాకెట్ నెట్‌వర్క్‌లను ఛేధిస్తున్నారు. తాజాగా మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది.
మన భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ‘డ్రగ్ రాకెట్’ (Drug Racket) ఒకటి. దీనిని నిర్మూలించేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఇల్లీగల్‌గా ఈ దందా నడుస్తూనే ఉంది. ఈమధ్య కాలంలో ఇది మరింత విస్తరించడంతో.. అధికారులు ప్రత్యేక ఆపరేషన్స్ నిర్వహించి, డ్రాగ్ రాకెట్ నెట్‌వర్క్‌లను ఛేధిస్తున్నారు. తాజాగా మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) (Narcotics Control Bureau), ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ (Delhi Police Special Cell) సంయుక్తంగా నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో.. అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ను (International Drug Trafficking Network) ఛేధించారు. ఈ కేసులో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. అలాగే.. మాదక ద్రవ్యాలను తయారు చేయడానికి ఉపయోగించే ‘సూడోపెడ్రిన్’ (Pseudoephedrine) అనే రసాయనాన్ని పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో తమిళనాడుకు (Tamilnadu) చెందిన ఓ సినీ నిర్మాత (Film Producer) మాస్టర్‌మైండ్‌గా ఉన్నాడని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. సూటోపెడ్రిన్‌ని వినియోగించి మేథాంఫేటమిన్ (Methamphetamine) అనే మాదక ద్రవ్యాన్ని తయారు చేస్తారు. ఇది ఎంతో ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్. దీనికి విదేశాల్లో డిమాండ్ చాలా ఎక్కువ. ఆస్ట్రేలియా (Australia), న్యూజిలాండ్‌లలో (New Zealand) సూడోఫెడ్రిన్ కిలోగ్రాముకు సుమారు రూ. 1.5 కోట్లకు అమ్ముడవుతోంది. ఆ దేశాలకు ఎక్కువ మొత్తంలో దీనిని సరఫరా చేస్తున్నట్టుగా అధికారులకు సమాచారం అందింది. హెల్త్ మిక్స్ పౌడర్స్, కొబ్బరి సంబంధిత ఆహార ఉత్పత్తులతో కలిపి.. సముద్ర మార్గాల్లో ఈ రసాయనాన్ని రవాణా చేస్తున్నట్లు కనుగొన్నారు. దీంతో.. ఎన్‌సీబీ ఈ డ్రగ్ మాఫియా కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టింది. దాదాపు నాలుగు నెలల పాటు నిఘా పెట్టగా.. ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాకు మరో పార్శిల్‌ను పంపేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఆ సరుకును పట్టుకున్నారు. అనంతరం ఫిబ్రవరి 15వ తేదీన పశ్చిమ ఢిల్లీలోని దారాపుర్‌లోని గోదాం ఉందని తెలిసి.. అక్కడ తనిఖీ నిర్వహించారు. అక్కడే ముగ్గురు నిందితులు అడ్డంగా దొరికారు. వారి వద్ద నుంచి అక్షరాల 50 కిలోల సూడోపెడ్రిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ల డ్రగ్ నెట్‌వర్క్ భారత్‌తో పాటు మలేషియా (Malaysia), న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు విస్తరించి ఉందని విచారణలో తేలింది. ఆ ముగ్గురు నిందితులు తమిళనాడుకు చెందినవారే.
విచారణలో భాగంగా.. ఈ డ్రగ్ ముఠా ఇప్పటివరకు రూ.2,000 కోట్లకు పైగా విలువ చేసే సుమారు 3,500 కిలోల సూడోఫెడ్రిన్‌తో కూడిన 45 పార్శిళ్లను సరఫరా చేసినట్లు వెల్లడైంది. గత మూడేళ్లుగా ఈ డ్రగ్ రాకెట్ కొనసాగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఆ ముగ్గురు నిందితుల్ని ప్రశ్నించగా.. ఈ రాకెట్ వెనుక తమిళనాడుకు చెందిన ఓ సినీ నిర్మాత ఉన్నట్టు తేలింది. అయితే.. అతని వివరాలు ఇంకా బయటకు రాలేదు. పరారీలో ఉన్న అతడ్ని పట్టుకోవడం కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే అతడి ఫొటోను విడుదల చేస్తామని చెప్పారు. అలాగే.. సూడోఫెడ్రిన్‌ను ఎక్కడి నుంచి సేకరించారన్న వివరాల్ని వెలికి తీసే పనిలోనూ అధికారులు నిమగ్నమయ్యారు.