Bihar floor test: మోదీని బీహార్‌లో నిలువరిస్తాం.. నితీష్‌కు తేజస్వి సవాల్
ABN , Publish Date - Feb 12 , 2024 | 03:54 PM
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీని బీహార్‌లో తాము అడ్డుకుంటామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సవాలు విసిరారు. ఒకే టర్మ్‌లో మూడు సార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రికార్డు నితీష్ కుమార్‌కే దక్కుతుందంటూ విసుర్లు విసిరారు.
పాట్నా: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సారథ్యంలోని బీజేపీని బీహార్‌లో తాము అడ్డుకుంటామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) సవాలు విసిరారు. అసెంబ్లీలో నితీష్ కుమార్ (Nitish Kumar) ప్రభుత్వం సోమవారంనాడు తమ బలం నిరూపించుకోనుంది. ఈ సందర్భంగా తేజస్వి యాదవ్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ, నితీష్ నిబద్ధతను నిలదీశారు. 'ఇండియా' (I.N.D.I.A.) బ్లాక్ నుంచి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరడం ద్వారా తొమ్మిదోసారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేయడాన్ని ప్రశ్నించారు. ఒకే టర్మ్‌లో మూడు సార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రికార్డు ఆయనకే దక్కుతుందంటూ విసుర్లు విసిరారు. మరోసారి ఆయన పార్టీ మారరనే గ్యారెంటీ ప్రధానమంత్రి ఇస్తారా? అని ప్రశ్నించారు.
''జేడీయూ ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్తారు? వారి ప్రశ్నలకు ఏమని సమాధానమిస్తారు? ఐదేళ్ల పదవీకాలంలో మూడుసార్లు ఎందుకు ప్రమాణస్వీకారం చేశారని అడిగితే ఆయన ఏమి బదులిస్తారు? ఇంతకుముందు మీరు (జేడీయూ) బీజేపీని విమర్శించారు. ఇప్పుడు పొగుడుతున్నారు. దీనికి ఏమి చెబుతారు? ఆర్జేడీ ప్రజల ముందుకు వెళ్తుంది. తాము ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని ఘనంగా చెప్పుకుంటుంది'' అని తేజస్వి అన్నారు.
సోషలిస్టు నేతగా చెప్పుకునే నితీష్ కుమార్ విపక్ష కూటమికి ఉద్వాసన చెప్పి బీజేపీతో చేతులు కలపడంపై ప్రజలకు ఏమి చెబుతారని తేజస్వి ప్రశ్నించారు. బీజేపీని ఆయన మేనల్లుడే (తేజస్వి) బిహార్‌లో అడ్డుకుంటాడని సవాలు విసిరారు. ''మిమ్మల్ని (నితీష్) మా కుటుంబ సభ్యుడిగా మేము భావిస్తాం. దేశవ్యాప్తంగా బీజేపీని అడ్డుకునేందుకు మీరు జెండా పట్టారు. ఇప్పుడు మీ మేనల్లుడు ఆ జెండా భుజాన వేసుకుంటాడు. బీహార్‌లో మోదీని అడ్డుకుంటాడు'' అని తేజస్వి స్పష్టం చేశారు.