Share News

National : రష్యాలో ఉగ్రదాడి

ABN , Publish Date - Jun 25 , 2024 | 04:34 AM

రష్యాలో ఉగ్రవాదులు అధునాతన ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ముసుగులు ధరించిన దుండగులు ఆదివారం రాత్రి ఉత్తర కాకసస్‌ రీజియన్‌లోని డాగెస్థాన్‌ నగరంలో రెండు చర్చిలు, యూదులకు చెందిన ఐదు ప్రార్థన మందిరాలు, ఒక పోలీసు పోస్టు లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు.

National : రష్యాలో ఉగ్రదాడి

  1. 20 మంది దుర్మరణం

  2. ఐదుగురు దుండగులు కాల్చివేత

మాస్కో, జూన్‌ 24: రష్యాలో ఉగ్రవాదులు అధునాతన ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ముసుగులు ధరించిన దుండగులు ఆదివారం రాత్రి ఉత్తర కాకసస్‌ రీజియన్‌లోని డాగెస్థాన్‌ నగరంలో రెండు చర్చిలు, యూదులకు చెందిన ఐదు ప్రార్థన మందిరాలు, ఒక పోలీసు పోస్టు లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 15 మంది పోలీసులు, ఒక చర్చి ఫాదర్‌ సహా.. 20 మంది మృతి చెందారు. చర్చిలోకి చొరబడ్డ దుండగులు ఫాదర్‌ నికోలేని గొంతు కోసి చంపారని, మరో నలుగురుని కాల్చివేశారని పోలీసులు వివరించారు. మృతుల్లో డాగెస్థాన్‌ నగర అంతర్గత భద్రత విభాగం చీఫ్‌ మావ్లుదిన్‌ ఖిదిర్నాబియేవ్‌ కూడా ఉన్నట్లు తెలిపారు. 20 మంది పోలీసులు సహా 40 మంది గాయపడ్డట్లు వివరించారు. భద్రతా బలగాలు వెంటనే కౌంటర్‌ ఆపరేషన్‌ను ప్రారంభించి, ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు వెల్లడించారు.

నిందితుల్లో అధికారి కుటుంబం

ఉగ్రవాదుల్లో డాగెస్థాన్‌ మునిసిపల్‌ అధికారి మాగొమెడ్‌ ఒమరోవ్‌ కుటుంబ సభ్యులు ముగ్గురు ఉన్నట్లు నిర్ధారించారు. వారిలో మాగొమెడ్‌ కుమారులు ఉస్మాన్‌ ఒమరోవ్‌, ఆదిల్‌ ఒమరోవ్‌, మేనల్లుడు ఉన్నట్లు గుర్తించారు. మాగొమెడ్‌ ఇంట్లో సోదాలు నిర్వహించామని, అతణ్ని అరెస్టు చేశామని చెప్పారు.

దాడిలో పోలీసు అధికారి కారు?

ఉగ్రవాదులు వినియోగించిన కారు(ఎన్‌వో75యూటీ05)షామిల్‌ ఇబ్రాగిమోవ్‌ అనే పోలీసు అధికారిపేరిట రిజిస్టరై ఉందని, అతను సెంటర్‌ ఫర్‌ కాంబాటింగ్‌ టెర్రరిజంలో పనిచేస్తారని గుర్తించారు.

Updated Date - Jun 25 , 2024 | 04:36 AM