Share News

Ram Mandhir: బాలరాముడి నుదుటిపై ‘సూర్య తిలకం’.. ఇదెలా సాధ్యమవుతుందో తెలుసా?

ABN , Publish Date - Apr 17 , 2024 | 06:50 PM

అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరామనవమి రోజున ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదుటిపై ‘సూర్య తిలకం’లా సూర్య కిరణాలు ప్రసరించాయి. కొన్ని నిమిషాల పాటు కనిపించిన ఈ ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు రాములోరి ఆలయానికి భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చారు.

Ram Mandhir: బాలరాముడి నుదుటిపై ‘సూర్య తిలకం’.. ఇదెలా సాధ్యమవుతుందో తెలుసా?
The Science Behind Surya Tilak

అయోధ్యలోని రామ మందిరంలో (Ram Mandir) శ్రీరామనవమి రోజున ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదుటిపై ‘సూర్య తిలకం’లా (Surya Tilak) సూర్య కిరణాలు ప్రసరించాయి. కొన్ని నిమిషాల పాటు కనిపించిన ఈ ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు రాములోరి ఆలయానికి భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చారు. ఈ అపూర్వ దృశ్యాన్ని చూసి భక్తులందరూ పరవశించిపోయారు. మరి ఈ అద్భుత దృశ్యం ఎలా సాధ్యమైంది? కంటికి కనిపించని ప్రత్యేక ఏర్పాట్లు ఏంటి? అనే ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

సునీల్ నరైన్ చారిత్రాత్మక రికార్డ్.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి


బాలరాముడి నుదటిపై సూర్య తిలకం కోసం అత్యాధునిక సాంకేతిక సాయాన్ని వినియోగించారు. సూర్య కిరణాలు గుడి మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని రాముని విగ్రహం నుదుటిపై ‘తిలకం’లాగా పడేలా.. కటకాలు, అద్దాలు, గేర్‌బాక్స్, గొట్టాలతో ఒక ప్రత్యేక వ్యవస్థను సృష్టించారు. తొలుత గుడిలోని మూడో అంతస్తుపై ఒక అద్దాన్ని అమర్చారు. సూర్య కిరణాలు ఆ అద్దంపై పడి.. దానికి ఎదురుగా అమర్చిన ఇత్తడి పైపులోకి ప్రవేశిస్తాయి. పైపులో ఉన్న రెండో అద్దంపై పడిన తర్వాత కిరణాలు 90 డిగ్రీల వంపుతో పైపులో అమర్చిన మూడు వేర్వేరు లెన్స్ గుండా లంబంగా పయనిస్తాయి. నిలువ పైపు చివర్లో అమర్చిన అద్దాన్ని ఆ కిరణాలు తాకినప్పుడు.. మళ్లీ 90 డిగ్రీల వంపుతో నేరుగా రాముడి నుదుటిపై 58 మిల్లీమీటర్ల పరిణామంలో తిలకంలా ప్రసరిస్తాయి. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌(ఐఐఏ) శాస్త్రవేత్తలు, పరిశోధకుల సహాయంతో.. కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ(సీబీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు ఈ వ్యవస్థను ప్రత్యేకంగా రూపొందించారు. ప్రతి శ్రీరామనవమి రోజున శ్రీరాముడి విగ్రహంపై సూర్యతిలకం దిద్దేలా దీనిని ఏర్పాటు చేశారు.

ఎన్నారైలకు ఓటు హక్కు ఉందా.. జైల్లో ఉన్న వ్యక్తి ఓటు వేయొచ్చా?

అయితే.. ప్రతి ఏటా సూర్యకిరణాలు ఒకే రకంగా ప్రసరించవు. గ్రహాల పరిభ్రమణం, సమయం ఒకేలా ఉండదు. అప్పుడు సూర్యతిలక స్థానం మారుతుంది. ఈ సమస్యని అధిగమించేందుకు గాను.. గడియారంలో ముల్లులు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానం తరహాలో గేర్‌ టీత్‌ మెకానిజంను శాస్త్రవేత్తలు వినియోగించారు. మూడో అంతస్తులో సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్ద.. మరో పరికరాన్ని అమర్చారు. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని.. 365 రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది. మళ్లీ శ్రీరామనవి వచ్చిన రోజున.. అనుకున్న చోటుకి అద్దాన్ని తీసుకొచ్చి, సూర్యతిలకం స్థానం మారకుండా చూస్తుంది. ఈ వ్యవస్థ 19 ఏళ్ల పాటు పని చేస్తుంది. ఆ తర్వాత.. సమయానికి అనుకూలంగా మార్పులు చేస్తే సరిపోతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 17 , 2024 | 08:59 PM