Pune : విహారయాత్ర విషాదాంతం
ABN , Publish Date - Jul 01 , 2024 | 05:39 AM
ఆదివారం కావడంతో సరదాగా జలపాతం చూసేందుకు వెళ్లిన కుటుంబం అందులో పడి గల్లంతైన ఘటన మహారాష్ట్రలోని లోనావాలా ప్రాంతంలో జరిగింది. అందులో తల్లి, ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యం కాగా, మరో ఇద్దరు చిన్నారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
జలపాతంలో కొట్టుకుపోయిన కుటుంబం
ముగ్గురి మృతదేహాలు లభ్యం.. ఇద్దరి గల్లంతు
పుణే, జూన్ 30: ఆదివారం కావడంతో సరదాగా జలపాతం చూసేందుకు వెళ్లిన కుటుంబం అందులో పడి గల్లంతైన ఘటన మహారాష్ట్రలోని లోనావాలా ప్రాంతంలో జరిగింది. అందులో తల్లి, ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యం కాగా, మరో ఇద్దరు చిన్నారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
పోలీసుల కథనం ప్రకారం... హదప్సర్‌కు చెందిన షాహిస్ధ అన్సారీ(36) అనే మహిళ, ఆమె నలుగురు పిల్లలు కలిసి లోనావాలలో బుషీ డ్యామ్‌కు సమీపంలో ఉన్న జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం పడుతుండటంతో జలపాతంలో నీటి ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది.
ఇది గమనించని ఆ కుటుంబం అక్కడ కేరింతలు కొడుతోంది. ఇంతలోనే వచ్చిన పెద్ద ప్రవాహం ఒక్క ఉదుటున వారిని కొట్టుకుపోయేలా చేసింది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. వీరిలో తల్లి అన్సారీ, అమీమా(13), ఉమేరా(8)ల మృతదేహాలు లభ్యమయ్యాయి. అద్నాన్, మరియా అనే ఇద్దరు చిన్నారుల కోసం గాలిస్తున్నాయి. కాగా, కొట్టుకుపోతూ కూడా కుటుంబ సభ్యులంతా ఒకరినొకరు పట్టుకొని సహాయం కోసం అర్థిస్తున్న హృదయ విదారకర దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.