Kejriwal: కేజ్రీవాల్ జైలుకు వచ్చినప్పుడు ఎంత బరువున్నారో ఇప్పుడూ అంతే..
ABN , Publish Date - Apr 03 , 2024 | 03:45 PM
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ బరువు తగ్గిపోయారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణలను జైలు అధికారులు తోసిపుచ్చారు. కేజ్రీవాల్ బరువు యధాతథంగా 65 కిలోలు ఉందని తెలిపారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ (Delhi liquor policy)కి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) బరువు (Weight) తగ్గిపోయారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చేసిన ఆరోపణలను జైలు అధికారులు (Jail Authorities) తోసిపుచ్చారు. కేజ్రీవాల్ బరువు యధాతథంగా 65 కిలోలు ఉందని తెలిపారు. జైలుకు వచ్చినప్పుడు ఎంత బరువు ఉన్నారో ఇప్పుడు అంతేనని వివరణ ఇచ్చారు. అయితే, ఢిల్లీ మంత్రి అతిషి మరోసారి తన వాదనకు పదునుపెట్టారు. కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఆయన బరువు 69.5 కిలోలు ఉన్నట్టు చెప్పారు.
తీహర్ జైలు ప్రెస్ రిలీజ్
కేజ్రీవాల్ బరువు తగ్గారంటూ వస్తున్న ఆరోపణలను ఒక ప్రెస్ రిలీజ్‌లో తీహార్ జైలు అధికారులు తోసిపుచ్చారు. 2024 ఏప్రిల్ 1న ఆయన జైలుకు వచ్చారని, అప్పుడు ఇద్దరు వైద్యులు పరీక్షలు చేశారని, ముఖ్యమైన అవయవాల పనితీరు నార్మల్‌గా ఉందని ఆ ప్రకటన తెలిపింది. ఆయన జైలుకు వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకూ 65 కిలోల బరువులో ఎలాంటి మార్పూ లేదని, కోర్టు ఆదేశాల ప్రకారం ఆయనకు ఇంటి భోజనం అందిస్తున్నామని తెలిపింది. మెడికల్ పారామీటర్స్ కూడా నార్మల్‌గా ఉన్నాయని స్పష్టం చేసింది.
అతిషి ఏమన్నారంటే?
కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినప్పుడు ఆయన బరువు 69.5 కిలోలు ఉండగా, అప్పట్నించి 12 రోజుల్లో 4.5 కిలోల బరువు తగ్గారని అతిషి తెలిపారు. డయాబెటిస్‌తో ఆయన బాధపడుతున్నారని, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆయన దేశం కోసం 24 గంటలూ శ్రమపడుతున్నారని చెప్పారు. అరెస్టయినప్పటి నుంచి 4.5 కిలోల బరువు తగ్గడం తీవ్ర ఆందోళన కలిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌ను జైలులో పెట్టించడం ద్వారా ఆయన ఆరోగ్యాన్ని ప్రమాద స్థితిలోకి బీజేపీ నెట్టేసిందని, ఆయనకు ఏదైనా జరిగితే, యావద్దేశం మరిచిపోయినా భగవంతుడు మాత్రం వారిని క్షమించడని అన్నారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.