TM Krishna: మార్గళి సంగీత సభలో టీఎం కృష్ణ కలకలం
ABN , Publish Date - Dec 27 , 2024 | 03:46 AM
కర్ణాటక సంగీత కచేరీలలో పాటిస్తున్న డ్రెస్ కోడ్‌కు ప్రముఖ గాత్ర విద్వాంసుడు టీఎం కృష్ణ స్వస్తి పలికారు. చెన్నై నగరంలో ప్రతియేటా మార్గశిర మాసంలో సంగీత కచేరీలు నిర్వహించడం ఆనవాయితీ.
కచేరీ డ్రెస్ కోడ్‌కు స్వస్తి... బీచ్ షర్టు, లుంగీతో హాజరు
చెన్నై, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): కర్ణాటక సంగీత కచేరీలలో పాటిస్తున్న డ్రెస్ కోడ్‌కు ప్రముఖ గాత్ర విద్వాంసుడు టీఎం కృష్ణ స్వస్తి పలికారు. చెన్నై నగరంలో ప్రతియేటా మార్గశిర మాసంలో సంగీత కచేరీలు నిర్వహించడం ఆనవాయితీ. కొన్నేళ్లుగా టీఎం కృష్ణ ఈ కచేరీలకు దూరంగా ఉంటున్నారు. హేతువాది పెరియార్‌ను కీర్తించే కీర్తనలను పాడడం, దళితలకు కూడా కర్ణాటక సంగీత మాధుర్యాలను అందించాలంటూ కచేరీలు వారి కాలనీల వద్దే చేయడం వంటి చర్యలు కలకలాన్ని సృష్టించాయి. తాజాగా బుధవారం రాత్రి మద్రాసు మ్యూజిక్ అకాడమీలో టీఎం కృష్ణ గాత్ర కచేరీ జరిగింది.
ఆ హాలులోని గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం టీఎం కృష్ణ గాన మాధుర్యాన్ని ఆస్వాదించేందుకు వచ్చిన సంగీత ప్రియులతో కిక్కిరిసిపోయాయి. ఈ కచేరీలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయన సంప్రదాయక దుస్తులు... పట్టు చొక్కా లేదా తెలుపు రంగు చొక్కా, పట్టు ధోవతి లేదా సాధరణ ధోవతి ధరించకుండా బీచ్ షర్ట్, లుంగీ ధరించారు. ఇది కొంత కలకలానికి కారణమయింది. అయితే ఆయన సంగీత మాధుర్యంలో మునిగితేలిన రసహృదయులు... కచేరీ ముగియగానే హర్షధ్వానాలతో ముంచెత్తారు.