PM Modi: రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాన్ని నిశ్శబ్దం చేసేందుకు ప్రయత్నించారు: మోదీ
ABN , Publish Date - Jul 22 , 2024 | 12:47 PM
కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన తరువాత ఎన్డీయే సర్కార్ తొలి బడ్జెట్ మంగళవారం ప్రవేశపెట్టబోతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు విలువైన సమయాన్ని ప్రతిపక్షాలు వృథా చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
ఢిల్లీ: కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన తరువాత ఎన్డీయే సర్కార్ తొలి బడ్జెట్‌ను మంగళవారం ప్రవేశపెట్టబోతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు విలువైన సమయాన్ని ప్రతిపక్షాలు వృథా చేస్తున్నాయని ఆయన విమర్శించారు.
"నేను బరువెక్కిన హృదయంతో చెబుతున్నా... కొందరు ఎంపీలు, ఇతరులను తమ నియోజకవర్గ సమస్యలపై సభలో మాట్లాడే సమయం ఇవ్వకుండా చేస్తున్నారు. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొనాలి. సభలో నిరసనలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని రాజ్యాంగ విరుద్ధంగా నిశ్శబ్దం చేసేందుకు ప్రయత్నించారు’’ అని మోదీ అన్నారు.
‘‘ఇదివరకు జరిగిన సభల్లో రెండున్నర గంటలు నాపై ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడాయి. ప్రజాస్వామ్య సంప్రదాయాల్లో ఇలాంటి వ్యాఖ్యలకు తావుండదు. వీటన్నింటినీ దేశం నిశితంగా పరిశీలిస్తోంది. విపక్షాలు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలి. కనీసం ఈ సమావేశాలైనా సజావుగా సాగుతాయని ఆశిస్తున్నా. 2014 తర్వాత కొంతమంది ఎంపీలు ఒకసారి, మరికొందరు రెండోసారి గెలిచారు’’ అని అన్నారు.
‘‘ కానీ.. విపక్షాల అరుపుల మధ్య వారిలో చాలా మంది వారి సమస్యలను సభాసాక్షిగా వినిపించలేకపోయారు. ఇక నుంచైనా సమావేశాలను సజావుగా సాగనిస్తూ.. ప్రజల ఆకాంక్షలను సభలో వినిపించనివ్వండి. 60 సంవత్సరాల తరువాత వరుసగా మూడు సార్లు ఓ పార్టీ అధికారంలోకి రావడం ఇదే తొలిసారి. మూడోసారి అధికారం చేపట్టాక తొలి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
‘‘సుపరిపాలనకు ఈ బడ్జెట్ ముఖ్యమైనది. రాబోయే 5 ఏళ్లకు ఇది దిశానిర్దేశం చేస్తుంది. 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి బలమైన పునాది అవుతుంది. గత మూడేళ్లలో దేశం 8 శాతం ఆర్థిక వృద్ధిని సాధించింది. దేశంలో పెట్టుబడిదారులకు సానుకూల వాతావరణం ఉంది. అందుకు తగినట్లు వేల సంఖ్యలో కంపెనీలు భారత్‌కి వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయ్. లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నాయ్" అని మోదీ పేర్కొన్నారు.
For Latest News and National News click here