బాల భారతానికి పర్యావరణ సవాళ్లు
ABN , Publish Date - Nov 21 , 2024 | 05:29 AM
తీవ్రమైన పర్యావరణ, ప్రమాదకరమైన వాతావరణ దుష్ప్రభావాలు భారతదేశంలో బాలల భవిష్యత్తుపై పడనున్నాయని యునిసెఫ్ హెచ్చరించింది.
2050 నాటికి దేశంలో 35 కోట్ల మంది పిల్లలు
వారి భవిష్యత్తుకు తక్షణ కార్యాచరణ అవసరం
యునిసెఫ్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ, నవంబరు 20: తీవ్రమైన పర్యావరణ, ప్రమాదకరమైన వాతావరణ దుష్ప్రభావాలు భారతదేశంలో బాలల భవిష్యత్తుపై పడనున్నాయని యునిసెఫ్ హెచ్చరించింది. 2050 నాటికి దేశంలో 35 కోట్ల మంది పిల్లలు ఆ ప్రభావాన్ని చవి చూడనున్నారని తెలిపింది. వారి శ్రేయస్సుతో పాటు హక్కులను కాపాడటానికి ఆ సవాళ్లకు వెంటనే పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ప్రపంచ బాలల స్థితి రిపోర్టు 2024ను మారుతున్న ప్రపంచంలో బాలల భవిష్యత్తు పేరుతో యునిసెఫ్ బుధవారం ఇక్కడ విడుదల చేసింది. దీనిలో మూడు మెగా ట్రెండ్స్‌ను యునిసెఫ్ ప్రముఖంగా ప్రస్తావించింది. అందులో జనాభాలో మార్పు, పర్యావరణ సంక్షోభం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నాయి. ఇవే 2050 కల్లా పిల్లల తలరాతను మారుస్తాయని స్పష్టం చేసింది.
2050వ దశకంలో అనూహ్య రీతిలో బాలలపై పర్యావరణ, వాతావరణ దుష్ప్రభావాలు పడతాయని, 2000 నాటితో పోలిస్తే 8 రెట్లు ఎక్కువ మంది పిల్లలు హీట్‌వేవ్ ప్రభావానికి లోనవుతారని అంచనావేసింది. ఇప్పటితో పోలిస్తే భారత్‌లో పిల్లల జనాభా 2050 నాటికి 10 కోట్లకుపైగా తగ్గుతుందని నివేదికలో యునిసెఫ్ తెలిపింది. 2050 నాటికి భారత జనాభాలో దాదాపు సగం మంది పట్టణాల్లో నివసించే అవకాశం ఉంది కాబట్టి చైల్డ్ ఫ్రెండ్లీ అర్బన్ ప్లానింగ్ అవసరమని యునిసెఫ్ సూచించింది.