Share News

Viral Video: కుర్చీ లాగి బలవంతంగా ప్రిన్సిపాల్‌ను తొలగించిన వైనం.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 06 , 2024 | 04:45 PM

ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిని ఉద్యోగంలో నుంచి తీసివేయాల్సి వస్తే.. ముందుగానే వారికి నోటీసులు ఇస్తారు. ఫలానా సమయం వరకు తమ విధులు నిర్వర్తించి, మర్యాదపూర్వకంగా..

Viral Video: కుర్చీ లాగి బలవంతంగా ప్రిన్సిపాల్‌ను తొలగించిన వైనం.. వీడియో వైరల్
UP Principal Forcibly Removed

ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిని ఉద్యోగంలో నుంచి తీసివేయాల్సి వస్తే.. ముందుగానే వారికి నోటీసులు ఇస్తారు. ఫలానా సమయం వరకు తమ విధులు నిర్వర్తించి, మర్యాదపూర్వకంగా తప్పుకోవాలని సూచిస్తారు. కానీ.. అప్పటికప్పుడే కుర్చీలో నుంచి లేపేసి, అవమానకంగా ఎవరినైనా తొలగించడం చూశారా? అలాంటి షాకింగ్ ఘటన తాజాగా వెలుగు చూసింది. ఓ ప్రిన్సిపాల్‌ను బలవంతంగా తొలగించి, మరొకరిని అప్పటికప్పుడే నియమించడం జరిగింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) చోటు చేసుకుంది. అసలు ఎందుకలా చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం పదండి.


ప్రయాగ్‌రాజ్‌లో బిషప్ జాన్సన్ గర్ల్స్ స్కూల్‌లో (Bishop Johnson Girls School) పారుల్ సోలమన్ (Parul Solomon) అనే మహిళ ప్రిన్సిపాల్‌గా పని చేస్తోంది. ఇటీవల ఆమెపై పేపర్ లీక్‌కి సంబంధించిన మల్టీ-క్రోర్ కుంభకోణంలో హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తమ దృష్టికి రావడంతో.. ఆ స్కూల్ ఛైర్మన్ సహా ఇతర సిబ్బంది కలిసి ఆమెను ప్రిన్సిపాల్ పదవి నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేశారు. అందుకు తాను ఒప్పుకోకపోవడంతో.. వాళ్లు బలవంతంగా కుర్చీ లాగి ఆమెను పక్కకు తప్పించారు. ఆ వెంటనే మరొకరిని ప్రిన్సిపాల్‌గా నియమించారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.


ఈ ఘటనపై లక్నో డియోసెస్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బిషప్ మారిస్ ఎడ్గార్ డాన్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 11 నాటి యూపీపీఎస్సీ రివ్యూ ఆఫీసర్ - అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ (RO-ARO) పేపర్ లీక్‌తో సంబంధం ఉన్న కొన్ని కోట్ల కుంభకోణంలో ఆమె హస్తం ఉందని తేలిందని తెలిపారు. తొలుత స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) ఈ పేపర్ లీక్ కేసులో తమ సిబ్బందికి చెందిన వినీత్ జస్వంత్‌ని అరెస్టు చేసిందని.. ఆ తర్వాత ఈ కుంభకోణంలో పారుల్ ప్రమేయం ఉన్నట్టు తెరమీదకి వచ్చిందని పేర్కొన్నారు. అందుకే తాము పారుల్‌ని తొలగించామని, ఆమె స్థానంలో షెర్లీ మేసీని కొత్త ప్రిన్సిపాల్‌గా నియమించామని వివరించారు.


పేపర్ లీక్ వ్యవహారం

కాగా.. ఫిబ్రవరి 11వ తేదీన పరీక్ష ప్రారంభం అవ్వడానికి ముందు ప్రయాగ్‌రాజ్‌లో పేపర్ లీక్ అయ్యింది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ‘బిషప్ జాన్సన్ గర్ల్స్ స్కూల్ ఎగ్జామ్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ వినీత్ యశ్వంత్‌తో పాటు మరో పది మందిని అరెస్టు చేసింది. పరీక్షా కేంద్రం నుంచి ఉదయం 6:30 గంటలకు పేపర్‌ను మొబైల్ ఫోన్‌లో ఫోటో తీసి లీక్ చేయడం జరిగింది. ఈ లీక్‌లో పారుల్ సోలోమన్ ప్రమేయం ఉన్నట్లు తేలింది. పారుల్ ప్రిన్సిపాల్‌గా ఉన్న సమయంలో పాఠశాల నుండి రూ.2.40 కోట్ల అవినీతికి పాల్పడ్డారని బిషప్ డాన్ ఆరోపించారు.

Updated Date - Jul 06 , 2024 | 04:50 PM