Shocking: కాసేపట్లో శవపరీక్ష.. సార్.. బతికే ఉన్నానంటూ యువకుడి కేక..
ABN , Publish Date - Nov 02 , 2024 | 11:52 AM
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరఠ్ హాస్పిటల్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. శవపరీక్ష నిమిత్తం ఆ యువకుడిని మార్చురీకి..
ఉత్తరప్రదేశ్, నవంబర్ 02: రాష్ట్రంలోని మీరఠ్ హాస్పిటల్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. శవపరీక్ష నిమిత్తం ఆ యువకుడిని మార్చురీకి తరలించారు. శవపరీక్షకు అవసరమైన పరికరాలన్నీ వైద్యలు చేతితో పట్టుకుని సిద్ధంగా ఉన్నారు.. ఇంతలో సార్ అంటూ గట్టిగా అరుపులు. సార్.. నేను చనిపోలేదు, బతికే ఉన్నాను అంటూ స్ట్రెచర్‌పై ఉన్న యువకుడు కేక వేశాడు. దీంతో సదరు వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చనిపోయాడనుకున్న వ్యక్తి ఎలా బ్రతికాడని ఆశ్చర్యపోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు కింద చూడొచ్చు..
మేరఠ్ జిల్లా గోట్కా గ్రామానికి చెందిన షగుణ్‌శర్మ అనే యువకుడు తన సోదరుడితో కలిసి బుధవారం రాత్రి బైక్‌పై ఖతౌలీ వైపు వెళ్లారు. అయితే అటు వైపు వేగంగా వచ్చిన మరో వాహనం షగుణ్ శర్మ బైక్‌ను ఢికొట్టింది. దీంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు.. షగుణ్ శర్మ, అతని సోదరుడిని మీరఠ్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. షగుణ్ శర్మ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స అందించారు. అయితే, తాజాగా షగుణ్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులకు సైతం ఇదే విషయాన్ని చెప్పారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసు కావడంతో వైద్యులు షగుణ్ శర్మకు పోస్టుమార్టం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
అతడి డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురీకి తరలించే ఏర్పాట్లు పూర్తి చేశారు. వైద్యులు షగుణ్‌కు శవపరీక్ష చేయబోతుండగా.. షగుణ్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. సార్.. నేను బతికే ఉన్నానంటూ గట్టిగా కేక పెట్టాడు. ఇది చూసిన వైద్యులు షాక్ అయ్యారు. వెంటనే షగుణ్‌ను మళ్లీ ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఆర్సీ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందో నిర్ధారించేందుకు విచారణకు ఆదేశించారు.
ఈ సంఘటనపై షగుణ్ కుటుంబ సభ్యులు, స్థానికులు.. మేరఠ్ వైద్య కళాశాల వైద్యులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రాణాలను కాపాడుతారని ఇక్కడికి తీసుకొస్తే బ్రతికున్న యువకుడిని చనిపోయాడని అంటారా? అంటూ నిప్పులు చెరిగారు. వైద్యులకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? ట్రిట్‌మెంట్ ఎందుకు సరిగ్గా చేయడం లేదని అక్కడి వైద్యులను నిలదీశారు.
Also Read:
ఆర్గానిక్ ఫుడ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయా? వైద్యుల చెప్పేదేంటంటే..
నాగార్జునపై సీఐడీ విచారణ జరపాలి
For More National News and Telugu News..