Uttar Pradesh : హత్రాస్ కేసులో ప్రధాన నిందితుడు మధుకర్ అరెస్టు
ABN , Publish Date - Jul 07 , 2024 | 03:03 AM
హత్రాస్ తొక్కిసలాట కేసులో ప్రధాన నిందితుడైన దేవప్రకాశ్ మధుకర్ (42) పోలీసులకు చిక్కాడు. హత్రాస్ ప్రత్యేక పోలీసు బృందం శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఢిల్లీలో అతడిని అరెస్టు చేసింది.
నోయిడా, జూలై 6: హత్రాస్ తొక్కిసలాట కేసులో ప్రధాన నిందితుడైన దేవప్రకాశ్ మధుకర్ (42) పోలీసులకు చిక్కాడు. హత్రాస్ ప్రత్యేక పోలీసు బృందం శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఢిల్లీలో అతడిని అరెస్టు చేసింది. ఈ నెల 2న యూపీలోని హత్రాస్ జిల్లా ఫుల్‌రాయీలో భోలే బాబా సత్సంగ్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధాన నిర్వహకుడు మధుకరే. అతనే ఆ కార్యక్రమానికి అనుమతి తీసుకున్నాడు. హత్రాస్ జిల్లాలోని సికందర్‌రావు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో కూడా అతనొక్కడినే నిందితుడిగా పేర్కొన్నారు. భోలే బాబా కార్యక్రమాలకు నిధులు సమీకరించడం కూడా మధుకరే చేస్తుంటాడని గుర్తించామని హత్రాస్ ఎస్పీ నిపుణ్ అగర్వాల్ తెలిపారు. 2010 నుంచి ఉపాధి హామీ పథకంలో కాంట్రాక్ట్ జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మధుకర్ కొన్నేళ్లుగా భోలే బాబా సంస్థ కోసం పనిచేస్తున్నాడు. శనివారం అతడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది.
వారిని వదిలిపెట్టొద్దు: భోలే బాబా
హత్రాస్ తొక్కిలాటపై శనివారం భోలే బాబా తొలిసారి స్పందించారు. కార్యక్రమంలో గందరగోళం సృష్టించిన వారిని వదిలిపెట్టొద్దని ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ‘‘జూలై 2 జరిగిన ఘటన నన్ను ఎంతో బాధించింది. మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటాం. క్షతగాత్రులను ఆదుకుంటాం’’ అని భోలే బాబా అన్నారు.