National : ఒడిశాలో జగన్నాథుడే ‘కీ’లకం!
ABN , Publish Date - May 25 , 2024 | 04:30 AM
సార్వత్రిక ఎన్నికల ఆరోదశ పోలింగ్‌లో భాగంగా శనివారం ఒడిశాలోని ఆరు కీలక పార్లమెంటు స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. వీటిలో పూరి, భువనేశ్వర్, కటక్, ఢెంకనాల్, శంబల్‌పూర్, కోంఝార్ నియోజకవర్గాలు ఉన్నాయి.
న్యూఢిల్లీ, మే 24: సార్వత్రిక ఎన్నికల ఆరోదశ పోలింగ్‌లో భాగంగా శనివారం ఒడిశాలోని ఆరు కీలక పార్లమెంటు స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. వీటిలో పూరి, భువనేశ్వర్, కటక్, ఢెంకనాల్, శంబల్‌పూర్, కోంఝార్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ దశలో పురీ జగన్నాథ ఆలయ రత్నభాండాగారం తాళం చెవుల వ్యవహారం రాజకీయ అంశంగా మారింది. మే 11న ఒడిశాకు ప్రచారానికి వచ్చిన మోదీ ఖంధమాల్ సభలో మాట్లాడుతూ.. తొలిసారి పూరి జగన్నాథుని రత్నభాండాగారం తాళం చెవుల ప్రస్తావన తెచ్చారు. ‘‘రత్న భాండాగారంలోని లోపలి గది తాళం చెవులు గత ఆరేళ్లుగా అదృశ్యమయ్యాయి. వీటికి సంబంధించి నకిలీ తాళం చెవులు తయారు చేయించామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఎవరు తయారు చేయించారు? ఎలా తయారు చేయించారు? అన్నది ఎవరికీ తెలియదు. దీనిపై దర్యాప్తు చేయించకుండా బీజేడీ ప్రభుత్వం ఎందుకు తప్పించుకుంటోంది?’’ అని నిలదీశారు. కానీ, విషయం తెలుసుకోకుండా మోదీ మాట్లాడుతున్నారని, జూలైలో జరిగే రథయాత్ర సమయంలో రత్నభాండాగారం తాళాలు తెరుస్తామని బీజేడీ నేతలు పేర్కొన్నారు.