Share News

Lok Sabha Elections: అమేథీ నుంచే వచ్చా, ఎప్పటికీ వారితో ఉంటా: రాహుల్ గాంధీ

ABN , Publish Date - May 17 , 2024 | 04:36 PM

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అమేథీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అమేథీ నుంచే తాను రాజకీయాలు నేర్చుకున్నానని, తాను వారితోనే ఉన్నానని, ఉంటానని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో కాంగ్రెస్, ఇండియా కూటమి అభ్యర్థి కేఎల్ శర్మ తరఫున శుక్రవారంనాడు ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

Lok Sabha Elections: అమేథీ నుంచే వచ్చా, ఎప్పటికీ వారితో ఉంటా: రాహుల్ గాంధీ

అమేథీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అమేథీ (Amethi)పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అమేథీ నుంచే తాను రాజకీయాలు నేర్చుకున్నానని, తాను వారితోనే ఉన్నానని, ఉంటానని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో కాంగ్రెస్, ఇండియా కూటమి అభ్యర్థి కేఎల్ శర్మ తరఫున శుక్రవారంనాడు ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాహుల్‌తో పాటు అఖిలేష్ కూడా ప్రచారానికి హాజరయ్యారు. ఐదో విడత పోలింగ్‌లో భాగంగా మే 20న అమేథీలో పోలింగ్ జరుగనుంది.


42 ఏళ్ల క్రితం తొలిసారి ఇక్కడికొచ్చా..

రాహుల్ తన ప్రసంగంలో 42 ఏళ్ల క్రితం తన తండ్రి రాజీవ్ గాంధీతో కలిసి అమేథీకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాల గురించి తాను ఏది నేర్చుకున్నా అది ఇక్కడి (అమేథీ) నుంచే నేర్చుకున్నానని, ప్రజలే తనకు నేర్పారని చెప్పారు. తాను తొలిసారి అమేథికి వచ్చిన సమయంలో అప్పుడు రోడ్లు కానీ, అభివృద్ధి కానీ లేదన్నారు. తన తండ్రికి, అమేథీ ప్రజలకు మధ్య ఉన్న ప్రేమానుబంధానికి తానే సాక్షినని చెప్పారు. తాను కూడా ఇదే తరహా రాజకీయాలను పాటిస్తున్నానని తెలిపారు. తాను రాయబరేలి నుంచి పోటీ చేస్తున్నప్పటికీ అమేథీతో మొదట్నించీ తనకున్న అనుబంధం చెక్కుచెదరదని, ఎప్పటికీ అమేథీ ప్రజల వెన్నంటి ఉంటానని చెప్పారు.

Lok Sabha Elections: మాకు 'హ్యాట్రిక్' ఖాయం: మోదీ ధీమా


కీలక ఎన్నికలు

2024 లోక్‌సభ ఎన్నికలు చాలా కీలకమని రాహుల్ తెలిపారు. ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీ నేతలు రాజ్యాంగాన్ని తిరగరాస్తామని, రాజ్యాంగాన్ని బుట్టదాఖలా చేస్తామని తొలిసారి చాలా స్పష్టంగా చెబుతున్నారని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి విమర్శించారు. రాజ్యాంగాన్ని చెరిపేద్దామా? రాజ్యాంగాన్ని తుడిచిపెట్టే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అని ప్రజలను ఉద్దేశించి రాహుల్ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ప్రజలే పరిరక్షించుకోవాలని, రాజ్యాంగమే ప్రజా వాణి, ప్రజా భవిష్యత్తు అని స్పష్టం చేశారు. ఈ దేశంలో పేద ప్రజలకు ఏది చేసినా, రైతులకు సహాయపడినా, హరిత విప్లవం తెచ్చినా రాజ్యాంగంతోనే సాధించామని చెప్పారు. రాజ్యాంగానికి చరమగీతం పాడాలని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని, రాజ్యాంగం కనుమరుగైతే ఇక ప్రభుత్వ రంగమనేదే ఉండదని, ఉద్యోగాలు ఉండవని, ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకుందని, రిజర్వేషన్లకు స్వస్తి పలుకుతారని, ప్రజల హక్కులు ఒక్కొక్కటి ఊడలాక్కుంటారని రాహుల్ హెచ్చరించారు. కేవలం ఎంపిక చేసిన 22-25 మంది కుబేరుల కోసం రైతులు, కార్మికులు, యువత, తల్లులు, సోదరీమణుల హక్కులను హరిస్తారని ఆరోపించారు.


బీజేపీకి 140 సీట్లు కూడా కష్టమే: అఖిలేష్

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 140 సీట్లు సాధించడం కూడా కష్టమేనని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. నాలుగు విడతల ఎన్నికలు పూర్తయ్యే సరికే బీజేపీ ఓటమిదశకు చేరుకుందన్నారు. వారి రథం మునకలేస్తోందని, 400 సీట్లు తమ లక్ష్యమని నినాదాలిచ్చినా ప్రజలు 140 సీట్లకే పరిమితం చేయనున్నారని చెప్పారు. రాజ్యాంగాన్ని, ప్రజల హక్కులను మార్చాలనుకుంటున్న వారిని ప్రజలే మార్చాలనుకుంటున్నారని అన్నారు. అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థిగా గాంధీ కుటుంబం విధేయుడుగా పేరున్న కిషోరి లాల్ శర్మ పోటీ చేస్తుండగా, బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, బీఎస్‌పీ అభ్యర్థిగా నాన్హె సింగ్ చౌహాన్ పోటీ పడుతున్నారు.

For More National News and Telugu News..

Updated Date - May 17 , 2024 | 05:09 PM