BJP vs Congress: ప్రియాంక గాంధీ నామినేషన్లో ఖర్గేను అవమానించారా.. అసలు ఏం జరిగింది
ABN , Publish Date - Oct 24 , 2024 | 06:34 PM
వయనాడ్‌లో ప్రియాంక గాంధీ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్న సమయంలో ఆఫీసర్ గదికి వెలుపల ఖర్గే వేచి ఉన్నట్టుగా వీడియోలో ఉంది. ఈ వీడియోను అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సహా పలువురు బీజేపీ నేతలు షేర్ చేశారు. అయితే ఈ ప్రచారం అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అసలు ఏం జరిగింది.
వయనాడ్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తన తల్లి సోనియా గాంధీ, భర్త రాబర్ట్ వాద్రా, సోదరుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు హాజరయ్యారు. అయితే నామినేషన్ సమర్పణ సమయంలో ఖర్గేను అగౌరవ పరిచారని, రిటర్నింగ్ అధికారి గదిలోకి రానివ్వకుండా బయటే ఉంచారని బీజేపీ ఆరోపించింది. అంతేకాదు దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వేషాన్ని పెంచుకుంటోందని విమర్శించింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా కాషాయ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి నిజంగానే ఖర్గేకు అవమానం జరిగిందా?.. అసలు ఏం జరిగింది.
వయనాడ్‌లో ప్రియాంక గాంధీ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్న సమయంలో ఆఫీసర్ గదికి వెలుపల ఖర్గే వేచి ఉన్నట్టుగా వీడియోలో ఉంది. ఈ వీడియోను అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ సహా పలువురు బీజేపీ నేతలు షేర్ చేశారు. అయితే ఈ ప్రచారం అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రియాంక నామినేషన్ దాఖలు సమయంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని అంటున్నాయి.
అసలు ఏం జరిగిదంటే..
ప్రియాంక గాంధీ బుధవారం మధ్యాహ్నం 1 గంటకు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ సమయంలోగా వయనాడ్‌లోని కల్పేటలో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకోవాలని భావించారు. కానీ రోడ్డు ర్యాలీ కారణంగా షెడ్యూల్ సమయం కంటే కాస్త ఆలస్యమయ్యారు. దీంతో రోడ్ ర్యాలీలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతుండగానే ఆమె ర్యాలీ మధ్యలోనే బయలుదేరి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. తన భర్త రాబర్ట్ వాద్రా, తన కుమారుడితో కలిసి మధ్యాహ్నం 1.24 గంటలకు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నామినేషన్ దాఖలు ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరణ జరిగింది. ఇక గుర్తింపు పొందిన జాతీయ లేదా రాష్ట్ర స్థాయి పార్టీల అభ్యర్థులను ఒక్కరు బలపరిచినా సరిపోతుంది. కాబట్టి కార్యాలయానికి చేరుకున్న వెంటనే మొదటి సెట్ పత్రాలు సమర్పించేందుకు ఆమె రిటర్నింగ్ ఆఫీసర్ గదిలోకి వెళ్లారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, తల్లి సోనియా, సోదరుడు రాహుల్ గాంధీ కాసేపట్లోనే వస్తారని, వారు రాగానే రాబర్డ్ వాద్రా, తన కొడకు బయటకు వెళ్తారని రిటర్నింగ్ ఆఫీసర్‌కు ప్రియాంక గాంధీ చెప్పారు. అయితే రెండో సెట్ నామినేషన్ పత్రాల సమర్పణ సమయంలో వారు లోపలికి రావొచ్చని అధికారి బదులిచ్చారు. దీంతో మధ్యాహ్నం 1.25 గంటలకు ప్రియాంక గాంధీ తన తొలి సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు.
కొన్ని నిమిషాల తర్వాత సోనియా గాంధీ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే రిటర్నింగ్ అధికారి పత్రాలను పరిశీలిస్తుండడంతో వీరిని లోపలికి అనుమతించలేదు. పరిశీలన తర్వాత రాబర్ట్ వాద్రా, ఆమె కుమారుడ బయటకు వెళ్లగా రెండవ సెట్ నామినేషన్ పత్రాల సమర్పణ సమయంలో ఖర్గే లోపలికి వెళ్లారు. నిజానికి మొదటి సెట్ నామినేషన్ పత్రాల పరిశీలన పూర్తయ్యేంతవరకు రాహుల్ గాంధీ కూడా బయటే వేచి ఉన్నారు. ఆ తర్వాతే వారిని లోపలికి తీసుకెళ్లారు. అయితే కలెక్టర్ కార్యాలయం వెలుపల ఖర్గే వెయిటింగ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోను వైరల్ అయిందని ‘ఇండియా టుడే’ కథనం పేర్కొంది. ఇందుకు సంబంధించి ఖర్గే ఉన్న ఫొటోలను కూడా కాంగ్రెస్ శ్రేణులు షేర్ చేశాయి.