Delhi Chalo: అన్నదాతల ఆందోళనకు కారణమేంటి? వారి డిమాండ్లు ఏంటి?
ABN , Publish Date - Feb 13 , 2024 | 04:13 PM
కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోవడం, డిమాండ్లను నెరవేర్చకపోవడంతో.. అన్నదాతలు మరోసారి కదం తొక్కారు. చలో ఢిల్లీ పేరుతో హస్తినలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి ట్రాక్టర్లతో బయలుదేరిన రైతులు.. సుదీర్ఘ కాలం పాటు నిరసన చేపట్టాలని నిర్ణయించుకొని.. అందుకు సరిపడా ఆహారం, ఇతర సామాగ్రిలను వెంట వేసుకొని వచ్చినట్టు తెలిసింది.
కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోవడం, డిమాండ్లను నెరవేర్చకపోవడంతో.. అన్నదాతలు మరోసారి కదం తొక్కారు. చలో ఢిల్లీ పేరుతో హస్తినలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి ట్రాక్టర్లతో బయలుదేరిన రైతులు.. సుదీర్ఘ కాలం పాటు నిరసన చేపట్టాలని నిర్ణయించుకొని.. అందుకు సరిపడా ఆహారం, ఇతర సామాగ్రిలను వెంట వేసుకొని వచ్చినట్టు తెలిసింది. 2020-21 సమయంలో తామంతా ఉద్యమించినప్పుడు డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చిన కేంద్రం వాటిని నెరవేర్చలేదని.. ఇప్పుడు ఆ హామీలను సాధించుకోవడం కోసమే ఈ భారీ ఆందోళన చేపట్టామని రైతులు చెప్తున్నారు.
దీంతో.. ఢిల్లీ సరిహద్దుల వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అదనపు పోలీసు బలగాలను మొహరించారు. ఢిల్లీలో 144 సెక్షన్ కూడా విధించారు. అంతేకాదు.. ర్యాలీగా వచ్చిన రైతన్నలపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలపై కఠినంగా ప్రవర్తించారు. రైతుల్ని పోలీసులు ఎక్కడిక్కడే నిలువరించారు. అయితే.. అన్నదాతలు కూడా వెనక్కు తగ్గడం లేదు. వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని పోలీసులు కోరగా.. తాము వెళ్లేదే లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే.. రైతులు ఈ ఆందోళన చేపట్టడానికి కారణం ఏంటి? వారి డిమాండ్లు ఏంటి? అనే విషయాలపై చర్చించుకుంటున్నారు.
రైతుల డిమాండ్లు
* పంటలకు కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చే చట్టం. ఇది రైతులకు ఇది కీలకమైన జీవనాధారం.
* విద్యుత్ సవరణ చట్టం 2020ని రద్దు చేయాలి.
* ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీలో మృతి చెందిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి.
* 2020లో రైతుల ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదైన కేసుల్ని ఉపసంహరించుకోవాలి.
* స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి.
* రైతులకు రుణమాఫీ చేయాలి.
కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), రైతు రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలుకు సంబంధించి న్యాయపరమైన హామీలపై చర్చించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే.. దీనిపై రైతు ప్రజాప్రతినిధుల నుంచి సరైన స్పందన రాలేదు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి అర్జున్ ముండా తెలిపారు. ఇదివరకే రైతులతో రెండు దఫాలుగా చర్చలు జరిగాయని, పరిష్కారానికి మరిన్ని చర్చలు అవసరమని, తాము ఒక మార్గాన్ని కనుగొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే.. రైతుల పరువు తీసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని.. రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన వివరణ ఇచ్చారు.