ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రాగానే.. కొలీజియం వ్యవస్థ రద్దు!
ABN , Publish Date - May 27 , 2024 | 05:32 AM
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మళ్లీ అధికారంలోకి రాగానే జడ్జిల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థను రద్దు చేసేందుకు మరోసారి ప్రయత్నిస్తుందని రాష్ట్రీయ లోక్ మోర్చా(ఆర్‌ఎల్‌ఎం) పార్టీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా ప్రకటించారు
అమిత్‌షా సమక్షంలో ఉపేంద్ర కుశ్వాహా
కరకట్(బిహార్), మే 26: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మళ్లీ అధికారంలోకి రాగానే జడ్జిల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థను రద్దు చేసేందుకు మరోసారి ప్రయత్నిస్తుందని రాష్ట్రీయ లోక్ మోర్చా(ఆర్‌ఎల్‌ఎం) పార్టీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా ప్రకటించారు.
బిహార్‌లోని కరకట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన ఆదివారం ఆ నియోజకవర్గంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏడోదశలో జూన్ 1న ఇక్కడ పోలింగ్ జరుగనుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ‘కొలీజియం వ్యవస్థలో అనేక లోపాలున్నాయి. అదో అప్రజాస్వామిక వ్యవస్థ. దళితులు, ఓబీసీలతోపాటు అగ్రవర్ణ పేదలకూ ఉన్నత న్యాయవ్యవస్థలో జడ్జిగా నియామకమయ్యే ద్వారాలు మూసేసింది.
సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ధర్మాసనాల కూర్పును మనం పరిశీలిస్తే.. కొన్ని వందల కుటుంబాల ఆధిపత్యం కనిపిస్తుంది’ అన్నారు. కొలీజియం వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ బిల్లును కొన్ని కారణాలతో సుప్రీంకోర్టు కొట్టివేసిందని, ‘కొలీజియం వ్యవస్థపై తూటా పేల్చే సాహసాన్ని ఎన్డీయే మాత్రమే చేయగలిగింది’ అని పేర్కొన్నారు.